అద్భుతమైన విజయంతో ఫైనల్ కు చేరుకున్న భారత మహిళల క్రికెట్ టీమ్

India Beat England By Four Runs to Enter Final. కామన్ వెల్త్ గేమ్స్ లో భారత మహిళలు ఫైనల్ కు చేరుకున్నారు.

By Medi Samrat  Published on  6 Aug 2022 1:59 PM GMT
అద్భుతమైన విజయంతో ఫైనల్ కు చేరుకున్న భారత మహిళల క్రికెట్ టీమ్

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత మహిళలు ఫైనల్ కు చేరుకున్నారు. ఆఖరి వరకూ ఎంతో ఆసక్తికరంగా సాగింది ఈ మ్యాచ్. చివరికి భారత జట్టునే విజయం వరించింది. కామన్వెల్త్ క్రీడల క్రికెట్ సెమీస్ లో టీమిండియా మహిళలు మొదట బ్యాటింగ్ చేసి మంచి స్కోరును సాధించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన చెలరేగి ఆడుతూ 32 బంతుల్లోనే 61 పరుగులు చేసింది. స్మృతి 8 ఫోర్లు, 3 సిక్సులు బాదింది. అనంతరం జెమీమా రోడ్రిగ్స్ 44, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 20, దీప్తి శర్మ 22 పరుగులు చేశారు. ఒకానొక దశలో 180 మార్కును భారత జట్టు చేరుకుంటుందని భావించారు. కానీ ఇంగ్లండ్ బౌలర్లు మంచిగా రాణించారు. ఫ్రేయా కెంప్ 2, కాథరిన్ బ్రంట్ 1, కెప్టెన్ నటాలీ సివర్ 1 వికెట్లు తీశారు.

ఛేజింగ్ ను ఇంగ్లండ్ దూకుడుగా మొదలు పెట్టింది. పవర్ ప్లేలోనే ఓపెనర్లు సోఫియా డంక్లీ, డానియెల్ వ్యాట్ దుమ్ము దులిపారు. పవర్ ప్లే లో 10 రన్ రేట్ తో ఇంగ్లండ్ బ్యాటర్లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆఖరి నాలుగు ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో భారత్ 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. నటాలీ షివర్ 41, ఎమీ జోన్స్ 31, డానియెల్ వ్యాట్ 35 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో స్నేహ్ రానా 2, దీప్తి శర్మ ఒక వికెట్ తీసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ముగ్గురు రనౌట్లు అవ్వడం భారత్ కు కలిసి వచ్చింది. ఈ విజయంతో భారత్ కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణం కోసం జరిగే పోరులో పోటీ పడనుంది. ఓడిన ఇంగ్లండ్ జట్టు కు కాంస్యం కోసం మ్యాచ్ ను ఆడబోతోంది.


Next Story