ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. భారత్ 434 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌తో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్ళింది.
ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా బ్యాటింగ్ సాగించలేదు. జాక్‌క్రాలీ (11), బెన్ డకెట్ (4), ఒలిపోప్ (3), జో రూట్ (7), జానీబెయిర్ స్టో (4), కెప్టెన్ బెన్‌స్టోక్స్ (15), రెహాన్ అహ్మద్ (0) లు చేసి అవుట్ అవ్వడంతో 50 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఇంగ్లండ్. ఈ దశలో వికెట్ కీపర్ బెన్‌ఫోక్స్ (16), టామ్ హార్డ్లీ(16) లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 32 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలబడలేదు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, అశ్విన్ లు చెరో వికెట్ తీశారు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 430/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో లభించిన 126 పరుగుల ఆధిక్యం కలుపుకుని ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఇంగ్లాండ్ 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 23న రాంచీ వేదికగా సాగుతుంది.