ఆసీస్ ఇచ్చిన స్ట్రోక్‌ నుంచి తేరుకోక‌ముందే భార‌త్‌కు ఐసీసీ షాక్

ICC Shock to Team India. సిడ్ని వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు ఘోర ఓట‌మిని

By Medi Samrat  Published on  29 Nov 2020 12:56 AM GMT
ఆసీస్ ఇచ్చిన స్ట్రోక్‌ నుంచి తేరుకోక‌ముందే భార‌త్‌కు ఐసీసీ షాక్

సిడ్ని వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు ఘోర ఓట‌మిని చ‌విచూసింది. దీంతో భార‌త జ‌ట్టుపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. టీమ్ ఓట‌మికి పేల‌వ ఫీల్డింగ్ డే ముఖ్య కార‌ణ‌మ‌ని మాజీలు అంటున్నారు. ఇక తొలి వ‌న్డేలో ఆసీస్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని రెండో వ‌న్డేకు సిద్ద‌మ‌వుతున్న భార‌త్‌కు ఐసీసీ( అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌) మ‌రో షాకిచ్చింది. తొలి వ‌న్డేల్లో భార‌త జ‌ట్టు నిర్ణీత స‌మ‌యం కంటే ఒక ఓవ‌ర్ త‌క్కువ‌గా వేసిన‌ట్లు నిర్థారించిన‌ ఐసీసీ.. భార‌త ఆట‌గాళ్ల మ్యాచ్ ఫీజుల్లో 20 శాతం జ‌రిమానా విధించింది.

టీమ్ఇండియా నిర్ణీత స‌మ‌యంలో ఒక ఓవ‌ర్ త‌క్కువ‌గా వేసింది. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫ‌రీల ఎలైట్ ప్యానెల్‌కు చెందిన డేవిడ్ బూన్ ఈ జరిమానా విధించిన‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ తప్పును అంగీకరించాడు. కాబట్టి అధికారిక విచారణ అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏ జ‌ట్టు అయినా.. 50 ఓవ‌ర్ల బౌలింగ్ కోటాను మూడున్న‌ర గంట‌ల్లో(210 నిమిషాల్లో) పూర్తి చేయాలి. కాగా.. భార‌త జ‌ట్టు తొలి వ‌న్డేలో 50 ఓవ‌ర్ల బౌలింగ్ కోటాను పూర్తి చేయ‌డానికి 246 నిమిషాలు తీసుకుంద‌ని స‌మాచారం. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన ఐసీసీ ప్రపంచకప్‌ సూపర్ లీగ్ నిబంధనల ప్రకారం.. స్లో ఓవర్‌ రేట్‌తో బౌలింగ్ చేసిన జట్టు ఒక ఛాంపియన్‌షిప్ పాయింట్‌ను కోల్పోతుంది.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్ ఆరోన్‌ ఫించ్ (114 124 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (105 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్‌ వార్నర్‌ (69 76 బంతుల్లో 6ఫోర్లు ) అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 66 ప‌రుగుల తేడాతో ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్యా(90 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), శిఖర్ ధావన్(74 86 బంతుల్లో 10 ఫోర్లు) రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు విఫ‌ల‌మ‌వ్వ‌డంతో.. సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌ను భార‌త్ ఓట‌మితో ఆరంభించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వ‌న్డే ఆదివారం జ‌ర‌గ‌నుంది.


Next Story