టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ‌.. పెనాల్టీతో పాటు పాయింట్లు క‌ట్ చేసిన ఐసీసీ..!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది.

By Medi Samrat  Published on  29 Dec 2023 3:01 PM IST
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ‌.. పెనాల్టీతో పాటు పాయింట్లు క‌ట్ చేసిన ఐసీసీ..!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. సెంచూరియన్‌లో జ‌రిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. అస‌లే ఓటమి బాధ‌లో ఉన్న భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కార‌ణంగా ఐసీసీ జరిమానా విధించింది. అలాగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల‌లో రెండు పాయింట్లను తగ్గించింది. ప్ర‌స్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా ఆరో స్థానానికి పడిపోయింది. ఈ క‌ర‌ణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల త‌ర్వాతి స్థానంలో టీమిండియా ఉంది.

సెంచూరియన్ టెస్టులో అవసరమైన ఓవర్ రేట్‌ను కొనసాగించడంలో భారత్ విఫలమైంది. ఐసీసీ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా కూడా భారత జట్టుపై పెనాల్టీగా విధించింది. ఐసీసీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ఓవ‌ర్ రేటుకు రెండు ఓవర్ల దూరంలో నిలిచినందున పెనాల్టీ విధించిన‌ట్లు పేర్కొంది. ICC ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఆటగాళ్లు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుంది.

టెస్టు ఓటమి తర్వాత భారత్ 16 పాయింట్లు 44.44 విజ‌య‌శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. పాయింట్ల తగ్గింపుతో టీమ్ ఇండియా ఇప్పుడు ఆరో స్థానంలో ఉంది. టీమిండియా ఖాతాలో ప్ర‌స్తుతం 14 పాయింట్లు, 38.89 విజ‌య‌శాతం ఉంది. దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో, పాకిస్థాన్ రెండో స్థానంలో, న్యూజిలాండ్ మూడో స్థానంలో, బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియా ఐదో స్థానంలో ఉన్నాయి. భారత్‌కు దిగువన వెస్టిండీస్ ఏడో, ఇంగ్లండ్ ఎనిమిదో స్థానంలో, శ్రీలంక తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.

దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసింది. అదే సమయంలో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు చేసింది. ఆఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 163 ​​పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 131 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Next Story