టీమిండియాకు ఐసీసీ షాక్.. ఐసీసీకి జియో హాట్ స్టార్ షాక్..!

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా భారత క్రికెట్ జట్టుకు జరిమానా పడింది.

By -  Medi Samrat
Published on : 8 Dec 2025 8:40 PM IST

టీమిండియాకు ఐసీసీ షాక్.. ఐసీసీకి జియో హాట్ స్టార్ షాక్..!

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా భారత క్రికెట్ జట్టుకు జరిమానా పడింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తెలిపింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేస్తే, ప్రతి ఓవర్‌కు 5 శాతం జరిమానా విధిస్తారు. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేసినట్లు ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ నిర్ధారించారు. కెప్టెన్ రాహుల్ తన తప్పిదాన్ని అంగీకరించి, ప్రతిపాదించిన జరిమానాకు సమ్మతించడంతో తదుపరి విచారణ అవసరం రాలేదు.

ఇక వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐసీసీకి 'జియోహాట్‌స్టార్' షాకిచ్చింది. ప్రసార బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. భారీ ఆర్థిక నష్టాల కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీకి అధికారికంగా తెలియజేసింది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనుంది. కేవలం ఈ టోర్నీకి మాత్రమే కాకుండా, 2024-27 మధ్య కాలానికి కుదుర్చుకున్న 3 బిలియన్ డాలర్ల మీడియా హక్కుల ఒప్పందంలోని మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్‌ను కూడా కొనసాగించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 2026-29 కాలానికి గాను 2.4 బిలియన్ డాలర్లతో కొత్తగా మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను ఐసీసీ ప్రారంభించింది.

Next Story