Video : కారులో ఫోటోషూట్‌కు వెళ్తూ లొల్లి మొద‌లుపెట్టారు.. చివ‌రికి ఎక్క‌డ ముగిసిందంటే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై క్రికెట్ ప్రేమికుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

By Medi Samrat  Published on  18 Feb 2025 10:51 AM IST
Video : కారులో ఫోటోషూట్‌కు వెళ్తూ లొల్లి మొద‌లుపెట్టారు.. చివ‌రికి ఎక్క‌డ ముగిసిందంటే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై క్రికెట్ ప్రేమికుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత జట్టుపై అభిమానుల్లో మంచి క్రేజ్ కనిపిస్తోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తన మొద‌టి మ్యాచ్ ఆడ‌నుంది. కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ కొత్త జెర్సీని విడుద‌ల చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండ‌గా.. భారత్ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడడం లేదు.

తాజాగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కారులో కూర్చున్న వీడియోను BCCI షేర్ చేసింది. ఇద్దరూ కొత్త జెర్సీలు ధరించి ఫోటోషూట్‌కి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య నంబర్ల విషయంలో మాటామంతి జరిగింది. ఐసీసీ నిర్వ‌హించిన‌ టోర్నీల‌లో ఇది తనకు 14వ టోర్నీ ఫోటోషూట్ అని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. 9 టీ20 ప్రపంచకప్‌లు, మూడు వన్డే ప్రపంచకప్‌లు, రెండు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ల కోసం తాను టీమిండియా జెర్సీలు ధరించి ఫోటోషూట్‌లు చేశానని జ‌డేజాతో చెప్పాడు. జడేజాతో ఇలా మాట్లాడుకుంటూనే ఇద్దరు క్రికెటర్లు ఫోటోషూట్ కోసం స్టూడియోకి చేరుకున్నారు.

త‌ర్వాత రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్ కలిసి ఉండ‌టం వీడియోలో చూడొచ్చు. జడేజా గిల్‌ను మీది ఎన్నో ఫోటోషూట్ అని అడిగాడు. గిల్ మాట్లాడుతూ మూడోది అని బ‌దులిచ్చాడు. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కూడా ఉన్నాయని గుర్తు చేసుకొని ఇది నా ఐదవ ఫోటోషూట్ అని చెప్పాడు. జడేజాను గిల్ నీ నంబర్ ఎంత? అని అడిగాడు.. జడ్డూ మరోసారి లెక్కలు వేసి రోహిత్ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని చెప్పాడు. నేను 15 ఫోటోషూట్‌లు చేసానని జడేజా చెప్పాడు.

కొత్త జెర్సీల‌తో ఫోటోషూట్ సందర్భంగా భారత ఆటగాళ్లు చాలా సరదాగా గడిపారు. పంత్ ఆటోగ్రాఫ్ ఇస్తూ స్మైలీ ఎమోజీ వేయ‌డంతో అర్ష్‌దీప్ సింగ్ అత‌డిని ఆట‌ప‌ట్టించాడు. మ‌రోప‌క్క మహమ్మద్ షమీ చాలా ఉత్సాహంగా ఫోటోషూట్ చేస్తూ కనిపించాడు. విరాట్ కోహ్లీ కూడా వీడియోలో కనిపించాడు.. కానీ కోహ్లీ సరదా క్షణాలు ఏవీ క్యాప్చర్ కాలేదు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తన మొదటి మ్యాచ్‌ను గురువారం ఆడుతుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని ప్రయత్నిస్తోంది. అంతకుముందు 2013లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది.

Next Story