'కెప్టెన్సీ ప్లేటులో పెట్టి ఇవ్వలేదు'.. : రోహిత్ కీలక వ్యాఖ్యలు
డ్రెస్సింగ్ రూమ్ వివాదంపై రోహిత్ శర్మ మౌనం వీడాడు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
By Medi Samrat Published on 4 Jan 2025 7:15 PM ISTడ్రెస్సింగ్ రూమ్ వివాదంపై రోహిత్ శర్మ మౌనం వీడాడు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. తనకు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదని కూడా రోహిత్ ధృవీకరించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతని పేలవమైన ఫామ్ కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్ట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న యువకుల గురించి రోహిత్‌ను అడగగా.. అతడు మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లు మొదట ఆటపై దృష్టి పెట్టాలి.. కెప్టెన్సీపై కాదు అన్నాడు.
నేను ప్రస్తుతం ఈ పొజిషన్‌లో ఉన్నాను. బుమ్రా ఈ పొజిషన్‌లో ఉన్నాడు. మాకంటే ముందు విరాట్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కంటే ముందు ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం వల్లనే (కెప్టెన్సీ) సాధించారు. ఎవరూ మాకు ప్లేట్‌లో పెట్టి కెప్టెన్సీ ఇవ్వలేదు. ఎవరికీ అలా ఉండదు.. కుర్రాళ్లను కష్టపడి పని చేయనివ్వండి. కుర్రాళ్లలో చాలా టాలెంట్ ఉంది.. భారత కెప్టెన్‌గా మారడం అంత సులభం కాదు.
ఒత్తిడి ఉంటుంది.. కానీ అది గొప్ప గౌరవం. మా చరిత్ర, క్రికెట్ ఆడే విధానాన్ని బట్టి మా ఇద్దరి భుజాలపై పెద్ద బాధ్యత ఉందన్నాడు. అబ్బాయిలు ముందుగా క్రికెట్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత, భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య వాదన జరిగిందని గుసగుసలు వినపడతున్నాయి. ఈ క్రమంలోనే సిడ్నీ టెస్టులో రోహిత్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు అంటున్నారు. ఈ పరిణామం తర్వాత రోహిత్ టెస్టు కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు.