హైదరాబాద్ నగరంలో స్థానికంగా ఉన్న ప్రతిభను గుర్తించడంతోపాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోని క్రికెటర్లను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TPL) నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. HCA అపెక్స్ కౌన్సిల్ ఫిబ్రవరి ప్రారంభంలో ప్రణాళికను రూపొందించింది. దానిని ఫలవంతం చేయడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.
హెచ్‌సీఏ ద్వారా ప్రతి జిల్లాకు రూ.కోటి చొప్పున కేటాయించి భూమిని సేకరించి స్టేడియాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో బహుళస్థాయి పార్కింగ్ వ్యవస్థతో సహా పునరుద్ధరణ కూడా జరుగుతుంది. తెలంగాణలో క్రికెట్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి.. తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TPL)కి ఆమోదం తెలిపేందుకు HCA సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుండి సహకారాన్ని కోరింది.
హైదరాబాద్, తెలంగాణ నుండి ప్రతిభను వెలికితీసేందుకు HCA.. TPLని నిర్వహిస్తుందని అన్నారు. “ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్‌లో చోటు దక్కించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అందుకే టీపీఎల్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అని ఆయన వివరించారు.
ప్రస్తుతం హెచ్‌సీఏలో నమోదు చేసుకున్న 250 మంది ఆటగాళ్లకు మెంటార్‌గా ఉండేందుకు భారత మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్‌తో సహా కొత్త కోచ్‌లను అసోసియేషన్ నియమించిందని తెలిపారు. టోర్నీకి సంబంధించి అసోసియేషన్ టెండర్లు విడుదల చేయగా.. 10 మంది క్రీడాకారులు లీగ్‌పై ఆసక్తి చూపారని వెల్లడించారు.
“ఐపీఎల్ ముగిసిన వెంటనే తెలంగాణ ప్రీమియర్ లీగ్ నిర్వహించబడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచేందుకు ఇది ఒక అవకాశం అవుతుంది’’ అని హెచ్‌సీఏ అధ్యక్షుడు పేర్కొన్నారు.