సైబరాబాద్ SOT పోలీసులు క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాజేంద్రనగర్, యస్.ఓ.టి, ఆర్.సి పురం పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో సిటీ పలుచోట్లు దాడులు చేశారు. బెట్టింగులు నిర్వహిస్తున్న ఓ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. రూ.18లక్షల నగదుతోపాటు మరో రూ.18లక్షల 34 వేల బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు కలిపి మొత్తం రూ.37లక్షల 84వేల 918 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిల్లీ కేంద్రంగా ఓ ఆన్ లైన్ యాప్ తయారు చేసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సెంటర్‌గా రామకృష్ణ గౌడ్, ఉపేందర్ గౌడ్ లు ఈ బెట్టింగ్ దందా నడుపుతున్నట్లు గుర్తించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
రామచంద్రాపురం ప్రాంతం లో ఓ ఇంటిపై దాడి చేసి రామకృష్ణా గౌడ్, ఉపేందర్ గౌడ్ లను పోలీసులు పట్టుకున్నారు. NICE7777 అనే APP ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది. ఆన్లైన్ బెట్టింగ్ కు కనెక్ట్ అయిన 5 బ్యాంక్ అకౌంట్స్ లలో ఉన్న రూ. 18,40,997/- నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. మొగిలిగిద్ద రామకృష్ణ గౌడ్ (30), మొగిలిగిద్ద ఉపేందర్ గౌడ్ (40), తలారి శ్రీనివాస్ (38), బండి వినయ్ కుమార్ (44) లను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన బుకీ అయిన సోను అనే వ్యక్తితో పాటు అంజి, చంద్రం, డోరా పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.