ఏడు రకాల బంతులేసే 'మిస్టరీ స్పిన్నర్‌'తో ఇంగ్లాండ్‌కు ఇంకెన్ని క‌ష్టాలో..

భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ-20 ఇంటర్నేషనల్‌లో బ్యాట్స్‌మెన్‌లకు అంతుచిక్కని 'మిస్టరీ'గా మారాడు.

By Medi Samrat  Published on  24 Jan 2025 10:10 AM IST
ఏడు రకాల బంతులేసే మిస్టరీ స్పిన్నర్‌తో ఇంగ్లాండ్‌కు ఇంకెన్ని క‌ష్టాలో..

భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ-20 ఇంటర్నేషనల్‌లో బ్యాట్స్‌మెన్‌లకు అంతుచిక్కని 'మిస్టరీ'గా మారాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన వరుణ్ చక్రవర్తి.. తన సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్ రెండో మ్యాచ్ ఆడాల్సి వుంది. ఇక్కడ మరోసారి అందరి దృష్టి వరుణ్ చక్రవర్తిపైనే ఉంటుంది.

కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఫేవరెట్‌గా భావించే వరుణ్ టీమిండియాలోకి తిరిగి వచ్చినప్పటి నుండి.. భిన్నంగా కనిపించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత 2024 అక్టోబర్‌లో వరుణ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత T20 పర్యటనలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు, దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌లలో 12 వికెట్లు తీసుకున్నాడు. బుధవారం కోల్‌కతాలో ఇంగ్లండ్‌పై మరోసారి మూడు వికెట్లు తీశాడు. వరుణ్‌ ఇప్పటి వరకు 14 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తం 22 వికెట్లు పడగొట్టాడు. వీటిలో అతడు అక్టోబర్‌లో జ‌ట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత గత ఎనిమిది మ్యాచ్‌లలో 20 వికెట్లు తీశాడు.

వరుణ్ ఏడు రకాల బంతులను వేయగలడు. ఇదే అతని బౌలింగ్‌లో రహస్యం. ప్రొఫెషనల్ క్రికెటర్ కాకముందు ఆర్కిటెక్ట్‌గా ఉన్న వరుణ్ మిస్టరీ బౌలింగ్ కారణంగా తొలుత‌ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. తాను ఏడు రకాలుగా బౌలింగ్ చేయగలనని కొన్నేళ్ల క్రితం వరుణ్ స్వయంగా పేర్కొన్నాడు. వీటిలో ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, గూగ్లీ, క్యారమ్ బాల్, ఫ్లిప్పర్, టాప్ స్పిన్, లెగ్ స్టంప్‌ యార్కర్ ఉన్నాయి. వైట్ బాల్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని బౌలింగ్ మరింత ప్రభావవంతంగా మారడానికి ఇదే కారణం. వరుణ్ 23 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 59 వికెట్లు తీశాడు. 102 టీ20 మ్యాచుల్లో 127 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ గురించి మాట్లాడితే.. వరుణ్ 71 మ్యాచ్‌ల్లో మొత్తం 83 వికెట్లు సాధించాడు.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో వరుణ్ (4-0-23-3) మూడు విలువైన వికెట్లు పడగొట్టాడు. అతను హ్యారీ బ్రూక్ (17), లియామ్ లివింగ్‌స్టన్ (0), కెప్టెన్ జోస్ బట్లర్‌ల‌ను అవుట్‌ చేశాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియం పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలమైనది. దీంతో పాటు ఈ గ్రౌండ్‌ దేశవాళీ క్రికెట్‌లో వరుణ్‌ సొంత మైదానం కూడా.. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి చెన్నైలో అందరి దృష్టి అత‌డిపైనే ఉంటుంది.

తన బౌలింగ్ గురించి వరుణ్ మాట్లాడుతూ.. "నేను బౌలింగ్ చేసేటప్పుడు నా పేస్‌ని మార్చడానికి ఎప్పుడు ప్ర‌య‌త్నిస్తాను. ఒకేలా బౌలింగ్ చేసి బ్యాట్స్‌మెన్‌కు సులభంగా కాకూడదనుకుంటున్నాను.. నేను ఆ విష‌య‌మై పని చేస్తున్నాను.. అలానే చేయడానికి ప్రయత్నిస్తున్నానని అన్నాడు.

భారత స్పిన్నర్ల గురించి ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ మాట్లాడుతూ, “మాకు నిజంగా మంచి ఆటగాళ్లున్నారు. వారు భారత్‌పై క‌ఠిన‌మై స్పిన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని మాకు తెలుసు. ప్రతి మ్యాచ్‌లో కనీసం ముగ్గురు స్పిన్నర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని నమ్ముతున్నాం.. వారిపై ఒత్తిడి తీసుకురావడానికి మా వ్యక్తిగత వ్యూహాలతో ఆడాలనుకుటున్నామ‌ని అన్నాడు.

Next Story