వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విధ్వంసకర ఆల్‌రౌండర్
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల మ్యాక్స్‌వెల్ తన 13 ఏళ్ల వన్డే కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అతడి ఆకస్మిక రిటైర్మెంట్ నిర్ణయంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన రిటైర్మెంట్‌కు కారణాన్ని కూడా మాక్స్‌వెల్ చెప్పాడు.
గ్లెన్ మాక్స్‌వెల్ 25 ఆగస్ట్ 2012న తన ODI అరంగేట్రం చేసాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో ODI క్రికెట్‌లో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ 7 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
2026లో జరగనున్న తదుపరి టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో.. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మాక్స్‌వెల్ టీ20 క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు చెప్పాడు. మాక్స్‌వెల్ 2015, 2023 ODI ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. 2023 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై అతని చారిత్రాత్మక ఇన్నింగ్స్ 201* ఎప్పటికీ మరచిపోలేనిది.
మాక్స్‌వెల్ ది ఫైనల్ వర్డ్ పోడ్‌కాస్ట్‌లో ఇలా అన్నాడు, "నేను నా జట్టుకు సమానంగా సహకరిస్తున్నానని భావిస్తే నేను వన్డేలకు ఎప్పటికీ దూరంగా ఉండేవాడిని కాదని నేను ఎప్పుడూ చెబుతాను, కానీ నేను స్వార్థపూరిత కారణాలతో ఆడాలని కోరుకోలేదు.. ముఖ్యంగా కాలి గాయం కారణంగా వన్డే క్రికెట్‌లోని శారీరక అవసరాలు తన ప్రదర్శనను ప్రభావితం చేస్తున్నాయని వివరించాడు. 2027 ODI ప్రపంచ కప్ వరకూ తను కొనసాగలేనని.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించానన్నాడు. 2027 ప్రపంచ కప్ గురించి తాను మాట్లాడానని.. బెయిలీతో ఈ విషయం చెప్పానని మాక్స్వెల్ వెల్లడించాడు.
నేను అప్పటి వరకూ ఆడగలనని అనుకోవట్లేదు, నా స్థానంలో ఇతర ఆటగాళ్లు ఈ పాత్రను చేపట్టేందుకు ప్రణాళికను ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. నేను ఆడటానికి సరిపోతానని భావించినంత కాలం నేను నా స్థానాన్ని వదులుకోనని ఎప్పుడూ చెప్పాను.. నేను ఇంకొన్ని సిరీస్‌లలో ఉండి దాదాపు స్వార్థపూరిత కారణాలతో ఆడాలని అనుకోలేదని వ్యాఖ్యానించాడు.