Video : డ్రెస్సింగ్ రూమ్‌లో పంత్‌పై ప్రశంసలు కురిపించిన కోచ్..!
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌పై టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు.
By Medi Samrat
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌పై టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. మాంచెస్టర్ టెస్ట్ డ్రా తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. గాయపడినప్పటికీ పంత్ హాఫ్ సెంచరీ.. జట్టు పట్ల తనకు ఉన్న అభిరుచి, ధైర్యం, అంకితభావానికి ఉదాహరణ.. తరువాతి తరం ఆటగాళ్లకు పంత్ ఆదర్శంగా నిలిచాడని కొనియాడాడు. డ్రెస్సింగ్ రూమ్ వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది.
మాంచెస్టర్ టెస్టులో కాలుకు గాయం కావడంతో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతని స్థానంలో తమిళనాడుకు చెందిన నారాయణ్ జగదీశన్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ సిరీస్ నుండి తొలగించటానికి ముందు పంత్ జట్టు స్కోరు 358 పరుగులకు చేరుకోవడానికి సహాయం చేశాడు. గాయపడినప్పటికీ ముఖ్యమైన అర్ధ సెంచరీని సాధించాడు.
అతని అభిరుచిని చూసి.. కోచ్ గంభీర్ అతన్ని చాలా ప్రశంసించాడు. బీసీసీఐ విడుదల చేసిన డ్రెస్సింగ్ రూమ్ వీడియోలో గంభీర్ మాట్లాడుతూ.."రిషబ్ జట్టు కోసం చేసినదానిపై ఈ టెస్ట్ జట్టు పునాది నిర్మించబడుతుంది. నేను టీమ్ గేమ్‌లో వ్యక్తిగతంగా ఎప్పుడూ ప్రశంసలు ఇవ్వను, కానీ అతడు డ్రెస్సింగ్ రూమ్‌కే కాకుండా తరువాతి తరానికి కూడా స్ఫూర్తినిచ్చాడు. దేశం మొత్తం గర్విస్తుంది. చాలా ఆకట్టుకునే ఘటన అని పేర్కొన్నాడు.
రిషబ్ పంత్ కూడా భావోద్వేగంతో మాట్లాడుతూ.. "జట్టు గెలవడానికి నేను ఏమి చేయాలనుకున్నానో అదే చేయడానికి ప్రయత్నించాను, నేను నా లక్ష్యం గురించి కాదు, జట్టు గురించి ఆలోచించాను. దేశం కోసం ఆడటం గర్వించదగిన విషయం. దేశం మొత్తం మీ వెనుక నిలబడి ఉన్నప్పుడు, ఆ అనుభూతిని మాటల్లో వివరించడం కష్టం అని పేర్కొన్నాడు.
టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ తర్వాత పంత్ కాలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాడు, అయినప్పటికీ అతడు బ్యాటింగ్ చేశాడని ప్రశంసించాడు. అతడి కాలు బాగా వాచిపోయింది. అతడు నడవలేకపోయాడు, కానీ అతను నడవడానికి ప్రయత్నించడమే కాకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను నిజంగా దేశం గర్వించే పుత్రుడు. దేశం మొత్తం అతనిని చూసి గర్విస్తోందని కొనియాడాడు.