గంభీర్ రాజకీయాల నుండి తప్పుకోడానికి కారణం ఏమై ఉండొచ్చు..!
బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నుండి బయటకు రావాలని గంభీర్ కోరుకున్నాడు.
By Medi Samrat
బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నుండి బయటకు రావాలని గంభీర్ కోరుకున్నాడు. తనను రాజకీయ బాధ్యతల నుండి తప్పించాలని.. పార్టీ చీఫ్ జెపి నడ్డాను గంభీర్ కోరారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను విమర్శించే వారిలో ఒకరైన గంభీర్ క్రికెట్ కమిట్మెంట్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు.
" క్రికెట్ కమిట్మెంట్లపై దృష్టి పెట్టడానికి నా రాజకీయ బాధ్యతల నుండి నన్ను తప్పించాలని నేను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాని అభ్యర్థించాను. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా కి హృదయపూర్వక ధన్యవాదాలు.. జై హింద్!," అని గంభీర్ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడా లేదా అనే విషయంపై మాత్రం గంభీర్ స్పష్టతను ఇవ్వలేదు. గౌతమ్ గంభీర్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్‌కి చెందిన అతిషిపై ఆయన విజయం సాధించారు. ఈసారి ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గంభీర్ పోటీ చేయడం లేదని తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ దేశంలో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లలో ఒకడు. అతను 58 టెస్టు మ్యాచ్‌ల్లో 41.96 సగటుతో 4,154 పరుగులు చేశాడు. ODIలలో.. 147 మ్యాచ్‌లలో 39.68 సగటుతో 5,238 పరుగులు చేశాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ భారత్ గెలవడానికి గంభీర్ బ్యాటింగ్ ను ఎవరూ మరచిపోలేరు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ IPL జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు.