క్రికెట్‌లో విషాదం.. దిగ్గజ అంపైర్‌ దుర్మరణం

Former South African umpire Rudi Koertzen passes away.క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం చోటు చేసుకుంది. ద‌క్షిణాఫ్రికాకు చెందిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2022 7:43 AM IST
క్రికెట్‌లో విషాదం.. దిగ్గజ అంపైర్‌ దుర్మరణం

క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం చోటు చేసుకుంది. ద‌క్షిణాఫ్రికాకు చెందిన మాజీ దిగ్గ‌జ అంపైర్ రూడి కోర్ట్‌జెన్ క‌న్నుమూశారు. ద‌క్షిణాఫ్రికాలోని రివ‌ర్‌డేల్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న‌తో పాటు మ‌రో ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. గోల్ఫ్‌ కోర్స్‌ నుంచి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆయ‌న వ‌య‌స్సు 73 సంవ‌త్స‌రాలు.

రూడి కోర్ట్‌జెన్ మ‌ర‌ణంపై ఆయ‌న కుమారుడు జూనియర్‌ కోయిర్జెన్ మాట్లాడుతూ ప్ర‌తీవారం ఆయ‌న త‌న స్నేహితుల‌తో గోల్ప్ టోర్న‌మెంట్ ఆడేందుకు వెళ్లేవారు. ఈ సారి కూడా అలాగే వెళ్లారు. వాస్త‌వానికి సోమ‌వార‌మే ఆయ‌న ఇంటికి తిరిగి రావాల్సి ఉంది. అయితే.. గోల్ప్‌లో మ‌రొక రౌండ్ ఆడాల‌న్న ఉద్దేశ్యంలో అక్క‌డే ఉండిపోయారు. ఇంటికి తిరిగి వ‌స్తార‌ని అనుకున్న స‌మ‌యంలో ఇలా జ‌రిగింద‌ని, ఆయ‌న మ‌ర‌ణ‌వార్త ఎంతో క‌లిచివేసింద‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు.

రూడి కోర్ట్‌జెన్ మృతి పట్ల ఐసీసీ సహా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు నివాళి ప్రకటించారు. కాగా రూడి కోర్ట్‌జెన్ మరణవార్త తెలుసుకున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న ద‌క్షిణాఫ్రికా జట్టు మంగళవారం ఇంగ్లాండ్ లయన్స్‌తో జ‌రిగిన‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగింది.

రూడి కోర్ట్‌జెన్ 1981లో అంపైర్‌గా త‌న కెరీర్ ప్రారంభించారు. 1992లో ఐసీసీ అంపైర్ ప్యాన‌ల్‌కు ఎంపిక‌య్యారు. 1992 నుంచి 2010 వ‌ర‌కు ఆయ‌న మొత్తం 331 అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌కు అంపైర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఇందులో 108 టెస్టులు, 209 వ‌న్డేలు, 14 టీ20లు ఉన్నాయి. 2003, 2007 ప్ర‌పంచ క‌ప్‌లో థ‌ర్డ్ అంపైర్‌గానూ సేవ‌లు అందించాడు. అలీమ్ దార్, స్టీవ్ బక్నర్ తర్వాత అత్యధిక టెస్టులకు అంపైర్ గా చేసిన ఘనత సాధించాడు రూడి కోర్ట్‌జెన్.

Next Story