ఈ ఐదుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లతో అప్రమత్తంగా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ మనదే..!
కేన్ విలియమ్సన్ కూడా భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారే ఆటగాడే. వికెట్‌పై నిలదొక్కుకుని జట్టుకు భారీ స్కోర్ అందించగలడు.
By Medi Samrat
భారత క్రికెట్ జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. ఇందులో విజయం సాధిస్తే ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరిస్తుంది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా మూడుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మధ్య కాలంలో భారత్‌ను దెబ్బకొట్టిన న్యూజిలాండ్.. ఈసారి కూడా అదే ప్రయత్నం చేస్తుంది.
ఇక కివీ జట్టును పరిశీలిస్తే.. భారత్‌ను ఓడించే సత్తా ఉన్న జట్టు ఇది. కివీ టీమ్‌లో భారత్‌ను తిప్పలు పెట్టగల ఆటగాళ్లున్నారు. ఫైనల్‌లో భారత్‌కు సమస్యగా మారే ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
రచిన్ రవీంద్ర
ప్రస్తుతం ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు బ్యాట్స్‌మెన్‌గా పరుగులు చేస్తూనే.. స్పిన్ బౌలింగ్‌తో అద్భుతాలు చేయగలడు. దుబాయ్ పిచ్‌పై రచిన్ రవీంద్ర ఆల్ రౌండ్ గేమ్ భారత్‌ను కష్టాల్లో పడేసే అవకాశం ఉంది. రచిన్ బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆడలేదు.. కానీ సెమీ-ఫైనల్‌లో పాకిస్తాన్‌పై సెంచరీ, దక్షిణాఫ్రికాపై సెంచరీ చేశాడు.
కేన్ విలియమ్సన్
కేన్ విలియమ్సన్ కూడా భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారే ఆటగాడే. వికెట్‌పై నిలదొక్కుకుని జట్టుకు భారీ స్కోర్ అందించగలడు. ప్రస్తుతం అతడు కూడా ఫామ్‌లో ఉండి పరుగులు సాధిస్తున్నాడు. అతను సెమీ-ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాపై 102 పరుగుల ఇన్నింగ్స్ కూడా చేశాడు. అంతకుముందు కూడా పరుగులు సాధించాడు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అతనికి భారత బౌలర్ల గురించి బాగా తెలుసు.
గ్లెన్ ఫిలిప్స్
గ్లెన్ ఫిలిప్స్ చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయగలడు. ఫినిషర్ పాత్రను చాలా బాగా పోషించగలడు. న్యూజిలాండ్‌లో ఫిలిప్స్ లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి లేడు. అతడు అద్భుతమైన ఫీల్డర్. చివరిసారిగా ఈ రెండు జట్లు తలపడిన సమయంలో ఫిలిప్స్.. కోహ్లీ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ పట్టాడు. తుఫాను బ్యాటింగ్‌తో పాటు ఫిలిప్స్ స్పిన్ కూడా భారత్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
మిచెల్ సాంట్నర్
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌తో కూడా భారత్ అప్రమత్తంగా ఉండాలి. దుబాయ్‌లోని స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లపై ఈ ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్.. భారతదేశానికి తలనొప్పిగా మారవచ్చు. సాంట్నర్‌పై పెద్ద బాధ్యత ఉంటుంది.. అతని కెప్టెన్సీలో జట్టు కప్ గెలిచే విధంగా శాయశక్తులా ప్రయత్నిస్తాడు.
డారిల్ మిచెల్
గతంలో భారత్‌ను ఇబ్బంది పెట్టిన మరో పేరు డారిల్ మిచెల్. ఈసారి కూడా అదే చేయగలడు. వన్డే ప్రపంచకప్-2025 సెమీ-ఫైనల్‌లో మిచెల్ అద్భుత సెంచరీ సాధించాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే శక్తి అతనికి ఉంది. అతని బౌలింగ్ కూడా భారత్‌కు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.