ఒలింపిక్స్ ను కరోనా భయం వెంటాడుతూ ఉంది. వివిధ దేశాల్లోని అథ్లెట్లకు, ఒలింపిక్స్ కోసం జపాన్ కు వెళ్తున్న ఓ దేశ బృందంలోని సభ్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా అథ్లెట్లు ఉంటున్న 'ఒలింపిక్స్ గ్రామం'లోనే ఓ కేసు నమోదైంది. ఈ విషయాన్ని టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది. ''ఒలింపిక్స్ గ్రామంలో ఓ అథ్లెట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే తొలి కేసు. ప్రొటోకాల్ లో భాగంగా టెస్టులు చేయగా.. ఆ అథ్లెట్ కు కరోనా సోకినట్టు తేలింది'' అని ఆర్గనైజింగ్ కమిటీ అధికార ప్రతినిధి మాసా తకాయా వెల్లడించారు. ప్రస్తుతం ఆ అథ్లెట్ ను ఐసోలేషన్ లో ఉంచినట్టు చెప్పారు. అతడిని కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ లో పెట్టామన్నారు. అథ్లెట్ పేరు.. ఏ దేశానికి చెందిన వారనే విషయాలను గోప్యంగా ఉంచారు.
ఒలింపిక్స్ కోసం టోక్యోకు వచ్చిన నైజీరియన్ ఒలింపిక్స్ బృందంలో ఓ 60 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అతడిని నరితా ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించారు. మిగతా బృంద సభ్యులందరినీ క్వారంటైన్ కు తరలించారు.
వాస్తవానికి టోక్యోలో గత ఏడాదే ఒలింపిక్స్ జరగాల్సి ఉన్నా కరోనా మహమ్మారి విజృంభణతో ఈ ఏడాదికి వాయిదా వేశారు. జులై 23 నుంచి ఒలింపిక్స్ మొదలవుతాయి. వివిధ దేశాలకు చెందిన 15,400 మంది ఒలింపిక్స్ పతకాల కోసం పోటీలో ఉన్నారు. తాజాగా ఒలింపిక్స్ విలేజీలో కరోనా కేసు సోకడంతో అథ్లెట్స్ లోనూ, నిర్వాహకుల్లోనూ టెన్షన్ మొదలైంది.