టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫేక్ ఫీల్డింగ్ వివాదంపై తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వల్ల తమకు అదనంగా రావాల్సిన ఐదు పరుగులు కోల్పోయామని బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ అహ్మద్ చెప్పాడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలివేయబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ తెలిపారు. ఫేక్ ఫీల్డింగ్ విషయాన్ని కెప్టెన్ షకీబల్ హసన్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాడని, అయినా వారు పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై తప్పకుండా మాట్లాడతామని అన్నారు. ఫేక్ ఫీల్డింగ్‌ను టీవీలో అందరూ చూశారని, అంపైర్ల దృష్టికి కెప్టెన్ తీసుకెళ్తే తాను చూడలేదని.. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అంపైర్ ఎరాస్మత్‌తో కెప్టెన్ షకీబల్ చాలాసేపు చర్చించాడన్నారు. అంపైరింగ్ అంశాలను సరైన వేదికపైకి తీసుకెళ్తామని జలాల్ స్పష్టం చేశారు.
మైదానంలో కోహ్లీ చేసిన పనిని అంపైర్లు చూసి ఉంటే, భారత్‌పై పెనాల్టీ పడి ఉండేదని ఆకాష్ చోప్రా భావిస్తున్నారు. ఈ విషయాన్ని తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చాడు ఆకాష్ చోప్రా.. కోహ్లి చేసిన పని కారణంగా అది 100% ఫేక్ ఫీల్డింగ్.. బంతిని విసరడానికి ప్రయత్నించాడు, అంపైర్లు అతను అలా చేయడం చూసి ఉంటే, ఖచ్చితంగా ఐదు పరుగుల పెనాల్టీ పడి ఉండేది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ తప్పించుకుంది. తర్వాత ఎవరైనా ఇలా చేస్తే అంపైర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. బంగ్లాదేశ్ మ్యాచ్ లో దానిని గమనించలేదు కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేమని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పారు.