డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా అవుట్
England beat Sri Lanka to make T20 World Cup semis, Australia Eliminated. సెమీస్ రేసు నుండి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా అవుట్ అయింది.
By Medi Samrat Published on 5 Nov 2022 2:00 PM GMTసెమీస్ రేసు నుండి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా అవుట్ అయింది. శ్రీలంక-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించడంతో సెమీస్ కు అర్హత సాధించింది.శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. 142 పరుగుల విజయలక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 42 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.
75 పరుగుల వరకు ఒక్క వికెట్టు కూడా కోల్పోకుండా ముందుకు వెళ్లిన ఇంగ్లండ్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. లంక స్పిన్నర్లు ధనంజయ డిసిల్వ, వనిందు హసరంగ, పేసర్ లహిరు కుమార రెండేసి వికెట్లు తీసి ఇంగ్లండ్ పై ఒత్తిడి పెంచారు. అంతకుముందు ఓపెనర్లు అలెక్స్ హేల్స్ 47, జోస్ బట్లర్ 28 పరుగులు చేసి శుభారంభం అందించారు. అయితే మిడిల్ ఓవర్లలో లంక బౌలర్లు బాగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ కాస్త కష్టపడింది.
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టుకు ఓపెనర్ పథుమ్ నిస్సంక (67) శుభారంభాన్ని ఇచ్చినా మిడిలార్డర్ విఫలమైంది. వరుసగా వికెట్లను చేజార్చుకున్న లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేసింది. కుశాల్ మెండిస్ (18), భానుకా రాజపక్స (22)లు ఫరవాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ కు 3 వికెట్లు దక్కగా... బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, శామ్ కర్రన్, ఆదిల్ రషీద్ లకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్ బెర్తు ఖాయం చేసుకోగా, ఆతిథ్య ఆస్ట్రేలియాకు తీవ్ర నిరాశ తప్పలేదు. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ చేరగా, రెండో జట్టుగా ఇంగ్లండ్ సెమీస్ చేరింది.