8 నెలల్లో 6 గురు కెప్టెన్లు.. ప్రధాన కోచ్ ద్రావిడ్ ఏమన్నాడంటే..?
Dravid gives interesting answer on working with 6 different India captains.2021 టీ20 ప్రపంచకప్ అనంతరం భారత హెడ్
By తోట వంశీ కుమార్ Published on 20 Jun 2022 8:03 AM GMT2021 టీ20 ప్రపంచకప్ అనంతరం భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టాడు. ఈ ఎనిమిది నెలల కాలంలో ఆరుగురు కెప్టెన్లలతో అతడు కలిసి పని చేశాడు. ఇంత తక్కువ కాలంలో టీమ్ఇండియాకు ఆరుగురు సారథులుగా వ్యవహరించడంపై ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇది తన ప్రణాళికలో లేదని, కొన్ని పరిస్థితుల కారణంగా ఇలా జరిగినట్లు చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ ఇది ఒక విధంగా మంచిదేనని అన్నాడు. ఎక్కువ మంది కెప్టెన్లుగా తయారు చేయడానికి ఉపయోగపడిందని తెలిపాడు.
కోహ్లీ, రోహిత్, ధావన్, కే ఎల్ రాహుల్, పంత్ వేర్వేరు సమయాల్లో టీమ్‌ఇండియా కెప్టెన్లుగా వ్యవహరించారు. త్వరలో ఐర్లాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా సారధ్యం వహించనున్న విషయం తెలిసిందే. దీనిపై ద్రవిడ్ మాట్లాడుతూ.. 'భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం తనకు సంతోషంగా ఉంది. ఇది అతి పెద్ద సవాల్. ఎనిమిది నెలల్లో టీమ్ఇండియాకు ఆరుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇది ముందస్తు ప్రణాళికలో భాగం కాకపోయినప్పటికీ, కరోనా, గాయాలు, ఆడుతున్న మ్యాచ్‌ల సంఖ్య వల్ల ఇలా జరిగింది. ఎక్కువ మంది ఆటగాళ్లతో కలిసి పనిచేయడం సరదాగా ఉంది. ఇలా జరగడం వల్ల యువ ఆటగాళ్లకు నాయకత్వం వహించే అవకాశం లభించింది. అదే విధంగా భవిష్యత్తు కెప్టెన్‌లను తయారు చేసే అవకాశాలు మాకు లభించాయి.' అని ద్రవిడ్ అన్నాడు.
పంత్ అంతర్భాగం..
దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పంత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ పంత్ జట్టులో అంతర్భాగమని ద్రావిడ్ స్పష్టం చేశాడు. రిషబ్ దూకుడుగా ఆడే క్రమంలో సిరీస్‌లోని పలు మ్యాచుల్లో విఫలం అయ్యాడు. అయితే.. అతడి శక్తి, సామర్థ్యాల మేరకు అతడు టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్‌లో అంతర్భాగమే. ఎడమ చేతి వాటం గల బ్యాట్స్‌మెన్ కావడంతో మధ్య ఓవర్లలో అతడు మాకు కీలకమైన ఆటగాడు. అలాగే ఒక్క సిరీస్‌తోనే అతడి కెప్టెన్సీని అంచనాకు రావొద్దు. అతడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. సిరీస్‌లో 0-2 తో వెనుకబడి తిరిగి పుంజుకుని 2-2తో సమం చేయడం ఆనందంగా ఉంది అని అన్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కారణంగా నాణ్యమైన పేసర్లు వెలుగులోకి వస్తున్నారని ద్రవిడ్ తెలిపాడు.