అభిమానుల‌ను క‌దిలించిన భార‌త ఆట‌గాడి ట్వీట్‌.. 'డియ‌ర్ క్రికెట్ మ‌రొక్క అవ‌కాశం ఇవ్వు'

Dear cricket give me one more chance Karun Nair shares emotional note.క‌రుణ్ నాయ‌ర్‌.. ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Dec 2022 6:54 AM GMT
అభిమానుల‌ను క‌దిలించిన భార‌త ఆట‌గాడి ట్వీట్‌.. డియ‌ర్ క్రికెట్ మ‌రొక్క అవ‌కాశం ఇవ్వు

క‌రుణ్ నాయ‌ర్‌.. ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. భార‌త క్రికెట్ అభిమానుల‌కు సుప‌రిచిత‌మైన పేరు. విధ్వంస‌కర వీరుడు సెహ్వాగ్ త‌రువాత భార‌త్ త‌రుపున టెస్టుల్లో త్రిశ‌త‌కం బాదిన ఆట‌గాడిగా చ‌రిత్ర పుట‌ల్లో నిలిచాడు. 2016లో త‌న అరంగ్రేటం టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై 303 ప‌రుగులు చేసి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఘ‌నంగా అడుగుపెట్టాడు. దీంతో టీమ్ఇండియాకు మ‌రో స్టార్ ఆట‌గాడు దొరికాడు అంటూ అభిమానులు సంబురాలు చేసుకున్నారు.

ఎంత త్వ‌ర‌గా పేరు సంపాదించుకున్నాడో అంతే త్వ‌ర‌గా క‌నుమ‌రుగు అయిపోయాడు. 2017లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ల‌లో వ‌రుస‌గా విఫ‌లం కావ‌డంతో సెల‌క్ట‌ర్లు అత‌డిని ప‌క్క‌న పెట్టారు. అత‌డు ఉన్నాడు అన్న సంగ‌తే వారు మ‌రిచిపోయారు. దేశ‌వాళీ టోర్నీలో రాణించిన‌ప్ప‌టికీ మ‌రోసారి భార‌త జ‌ట్టుకి ఆడే అవకాశాలు రాలేదు. జ‌ట్టులో చోటు ఇవ్వ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఎప్పుడు ఎవ్వ‌రు చెప్ప‌లేద‌ని ఓ సంద‌ర్భంలో త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

అయిన‌ప్ప‌టికీ దేశ‌వాళి క్రికెట్‌లో క‌ర్ణాట‌క త‌రుపున ఆడుతున్నాడు. అయితే.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న రంజీ ట్రోఫీలో పాల్గొనే క‌ర్ణాట‌క జ‌ట్టులో క‌రుణ్ నాయ‌ర్‌కు చోటు ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలో అత‌డు చేసిన పోస్ట్ క్రికెట్ అభిమానుల హృద‌యాల‌ను తాకుతోంది. "డియ‌ర్ క్రికెట్‌.. నాకు మ‌రొక్క ఛాన్స్ ఇవ్వు" అంటూ భావోద్వేగ ట్వీట్ చేశాడు.

దీనిపై క్రికెట్ అభిమానులు స్పందిస్తున్నారు. నువ్వు సాధించిన త్రిశ‌త‌కం ఇంకా మా క‌ళ్ల ముందు మెదులుతూనే ఉంది. నీ లాంటి ఆట‌గాడిని మ‌ళ్లీ భార‌త జ‌ట్టులో చూడాల‌ని ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it