భారత్‌తో మ్యాచ్ అంటే రెచ్చిపోతాడు.. మరో సెంచరీ..!
టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) సెంచరీలతో విరుచుకుపడ్డారు.
By - Medi Samrat |
టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) సెంచరీలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరి అద్భుతమైన బ్యాటింగ్‌తో కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు ఆరంభంలోనే కివీస్‌ను దెబ్బతీశారు. కేవలం 5 పరుగులకే ఓపెనర్లు డెవాన్ కాన్వే (5), హెన్రీ నికోల్స్ (0) పెవిలియన్ చేరారు. కాసేపటికే విల్ యంగ్ (30) కూడా ఔట్ కావడంతో న్యూజిలాండ్ 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 219 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 137 పరుగులు చేయగా, ఫిలిప్స్ 88 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు సాధించాడు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీశారు. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌కు తలో వికెట్ దక్కింది.
ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో డారెల్ మిచెల్ అద్భుతంగా ఆడుతున్నాడు. తొలి వన్డేలో 84 పరుగులతో రాణించిన మిచెల్. రాజ్‌కోట్‌లో సెంచరీ బాది భారత్ కు మ్యాచ్ ను దూరం చేశాడు. మిచెల్ భారత్‌లో తను ఆడిన చివరి ఐదు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా నాలుగుల సెంచరీలు కొట్టాడు. భారత్‌పై వన్డేల్లో అతడి సగటు దాదాపు 70గా ఉంది.