కొందరు క్రికెటర్లు న్యూడ్ ఫోటోలు పంపేవారు.. లింగ మార్పిడి శస్త్రచికిత్స త‌ర్వాత పరిస్థితుల‌పై అన‌య బంగర్

భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ గత సంవత్సరం హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, లింగ నిర్ధారణ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

By Medi Samrat
Published on : 18 April 2025 2:30 PM IST

కొందరు క్రికెటర్లు న్యూడ్ ఫోటోలు పంపేవారు.. లింగ మార్పిడి శస్త్రచికిత్స త‌ర్వాత పరిస్థితుల‌పై అన‌య బంగర్

భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ గత సంవత్సరం హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, లింగ నిర్ధారణ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆర్యన్ ప్ర‌స్తుతం అన‌య‌గా నామ‌క‌ర‌ణం చేసుకుంది. ఆమె శస్త్రచికిత్స ముందు క్రీడాకారిణి.. ఆమె తండ్రి సంజయ్ బంగర్ అడుగుజాడలను అనుసరించి క్రికెట్ ఆడింది. కానీ జెండ‌ర్ సర్జరీ తర్వాత తన క్రికెట్ కెరీర్‌లో చాలా అడ్డంకులు వచ్చాయని అనయ వెల్లడించింది. అనయ ప్రస్తుతం UKలో నివసిస్తున్నారు.

మొదటి నుంచి అనయ ప్రయాణం అంత ఈజీ ఏమీ లేదు. క్రికెట్ ప్రపంచంలో పురుషుల ఆధిపత్యం గురించి అనయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. లాలాంటాప్‌లో ఇంటర్వ్యూ సందర్భంగా.. మీరు తప్పు లింగంలో ఉన్నార‌ని మీరు ఎప్పుడు గ్రహించారు? అని అడిగారు. దానికి అనయ.. 'నా వయసు ఎనిమిది లేదా తొమ్మిదేళ్లు. అప్పుడు నేను అమ్మ బట్టలు ఆమె అల్మారాలోంచి తీసి వేసుకునేదాన్ని. అప్పుడు అద్ధంలో నన్ను నేను చూసుకుని, 'నేను అమ్మాయిని.. అమ్మాయిగా ఉండాలనుకునేదాన్న‌ని బ‌దులిచ్చింది.

అనయ మాట్లాడుతూ.. 'నేను ముషీర్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి చాలా మంది ప్రముఖ క్రికెటర్లతో ఆడాను. నా తండ్రి చాలా ప్రసిద్ధ వ్యక్తి కాబట్టి.. నేను నా గోప్యతను పాటించేదాణ్ని.. క్రికెట్ ప్రపంచం అభద్రతతో, పురుషుల ఆధిపత్యంతో నిండి ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

లింగ నిర్ధారణ సర్జరీ చేయించుకున్నప్పుడు తోటి క్రికెటర్ల స్పందన ఏమిటని అనయను ప్రశ్నించారు. 'కొంతమంది వేధింపులకు ప్రయత్నించగా.. కొందరు సపోర్ట్ చేశారు' అని అనయ బదులిచ్చారు. ఎలాంటి వేధింపులు? అని యాంకర్ అడగ‌గా.. 'కొందరు క్రికెటర్లు అకస్మాత్తుగా తమ న్యూడ్ ఫోటోలను నాకు పంపారు' అని అనయ బదులిచ్చారు. 'ఒక వ్యక్తి నన్ను అందరి ముందు దుర్భాషలాడేవాడు. త‌ర్వాత‌ అదే వ్యక్తి వచ్చి నా దగ్గర కూర్చుని నా ఫోటోలు అడిగాడని పేర్కొంది. 'ఇంకో సంఘటన ఉంది. నేను భారత్‌లో ఉన్నప్పుడు.. ఓ వెట‌ర‌న్ క్రికెటర్‌కి నా పరిస్థితి చెప్పాను.. అతను కారులో వెళ్దాం.. నేను మీతో పడుకోవాలనుకుంటున్నానని త‌న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టిన‌ట్లు వెల్ల‌డించింది.

సంజయ్ బంగర్ వలె.. అనయ కూడా ఒక క్రికెటర్.. స్థానిక క్లబ్ క్రికెట్‌లో ఇస్లాం జింఖానాకు ప్రాతినిధ్యం వహించారు. ఇది కాకుండా అనయ లీసెస్టర్‌షైర్‌లోని హింక్లీ క్రికెట్ క్లబ్‌కు కూడా ఆడారు.

అయితే నవంబర్ 2023లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనడానికి అనుమతిని నిరాక‌రించింది. ICC CEO Geoff Allardyce 'ఒక గేమ్‌గా కలుపుకోవడం మాకు చాలా ముఖ్యమైనది.. అయితే అంతర్జాతీయ మహిళల ఆట యొక్క సమగ్రతను, క్రీడాకారుల భద్రతను కాపాడటమే మా ప్రాధాన్యత' అని అన్నారు. కొత్త ఐసిసి నిబంధనపై తన నిరాశను వ్యక్తం చేస్తూ అనయ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో సుదీర్ఘ పోస్ట్ రాశారు. అనయ ప్రస్తుతం మాంచెస్టర్‌లో నివసిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు.

అనయ తండ్రి సంజయ్ బంగర్ ప్రస్తుతం IPLలో కామెంటేట‌ర్‌ ప్యానెల్‌లో ఉన్నారు. హిందీ కామెంటరీ ప్యానెల్‌లో బంగర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం కనిపిస్తుంది. బంగర్ భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నప్పుడు జ‌ట్టు అంతర్జాతీయ స్థాయిలో ఆధిపత్యం చెలాయించింది.

Next Story