టీమిండియా స్టార్ క్రికెటర్, సూర్యకుమార్ యాదవ్ సతీసమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యకుమార్ యాదవ్ దంపతులను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వన్డేలు, టీ20లలో అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్.. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలిసారి టెస్టుల్లోనూ చోటు దక్కించుకున్నారు. అయితే తొలి మ్యాచ్ లో పెద్దగా రాణించలేదు. రెండో టెస్టులో బెంచ్ కే పరిమితం అయ్యారు. మార్చి 1 నుంచి మూడో టెస్టు జరగనుంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తులు ఒక కంపార్టుమెంట్‌లో శ్రీవారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 61,374 మంది దర్శించుకోగా 19,691 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు వచ్చిందని తెలిపారు.