128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో అడుగుపెట్ట‌నున్న‌ క్రికెట్..!

128 ఏళ్ల తర్వాత క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలన్న నిర్ణయానికి ఆమోదం లభించింది.

By Medi Samrat  Published on  16 Oct 2023 11:13 AM GMT
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో అడుగుపెట్ట‌నున్న‌ క్రికెట్..!

128 ఏళ్ల తర్వాత క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలన్న నిర్ణయానికి ఆమోదం లభించింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చనున్నారు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆమోదించింది. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నేతృత్వంలో సోమవారం ముంబైలో జరిగిన సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. గతంలో 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడారు. అంటే 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టనుంది.

ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అధికారుల సమావేశంలో క్రికెట్‌తో సహా ఐదు క్రీడలను చేర్చాలన్న నిర్ణయానికి ఆమోదం లభించింది. క్రికెట్‌తో పాటు, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోస్‌లతో సహా ఐదు కొత్త క్రీడలను చేర్చాలనే లాస్ ఏంజెల్స్ నిర్వాహకుల ప్రతిపాదన ఆమోదించబడింది. దీనికి సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే ఆమోదం పొందింది. అయితే.. 2028 గేమ్స్‌లో చోటు దక్కించుకోవడానికి IOC సభ్యత్వపు ఓటు అవసరం. ఈ ఓటింగ్ ద్వారా ఐదు కొత్త క్రీడలు సోమవారం అధికారికంగా చేర్చబడ్డాయి. లాస్ ఏంజిల్స్-28 ఆర్గనైజింగ్ కమిటీ ఐదు క్రీడలను జోడించాలనే ప్రతిపాదనను 99 IOC సభ్యులు ఓటింగ్‌లో ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు.

IOC ట్విట్టర్ లో ఒక పోస్ట్‌లో ఈ విష‌యాన్ని ధృవీకరించారు. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఐదు కొత్త క్రీడలను చేర్చాలనే ఆర్గనైజింగ్ కమిటీ ప్రతిపాదనను IOC సెషన్ ఆమోదించింది. అలాగే క్రికెట్ ముందు టీ20 అని ఐఓసీ రాసింది.అంటే టీ20 ఫార్మాట్ లోనే క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయి. వీటిలో పురుషుల, మహిళల క్రికెట్ మ్యాచ్‌లు ఉంటాయి.

గతంలో 1900 సంవ‌త్స‌రంలో జ‌రిగిన‌ పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ స్వర్ణ పతకం కోసం ఇంగ్లండ్, ఫ్రాన్స్ తలపడ్డాయి. అయితే చాలా కాలంగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా ఇప్పుడు అది సఫలమైంది క్రికెట్‌కు ఉన్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని.. IOC భారత ఉపఖండంలోని మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ కారణంగా పురుషుల, మహిళల టీ20 క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చనున్నారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. క్రికెట్‌ను చేర్చడంతో 2024 పారిస్ ఒలింపిక్స్ ప్రసార హక్కులు రూ. 158.6 కోట్ల నుండి 2028 నాటికి రూ. 1525 కోట్లకు చేరుకునే అవ‌కాశం ఉంది. ఐసీసీ ప్రెసిడెంట్ గ్రెగ్ బార్క్లే కూడా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలన్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు.

IOC అధ్యక్షుడు థామస్ బాచ్ మాట్లాడుతూ.. పాల్గొనే జట్ల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఐసీసీతో కలిసి పని చేస్తాం. మేము ఏ దేశంలోని వ్యక్తిగత క్రికెట్ అధికారులతో కలిసి పని చేయము. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సహాయంతో క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం పొందించిందేందుకు కృషి ఏస్తామ‌న్నారు.

Next Story