టీమిండియా హెడ్ కోచ్ అవడానికి గంభీర్ సిద్ధంగా లేడు.. మరి జై షా ఆయ‌న్ని ఎలా ఒప్పించారు.?

భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ టీం ఇండియా కోచ్ పదవికి ఆఫర్ వచ్చినప్పుడు తాను పూర్తిగా సిద్ధంగా లేనని వెల్లడించాడు.

By -  Medi Samrat
Published on : 11 March 2026 12:44 PM IST

టీమిండియా హెడ్ కోచ్ అవడానికి గంభీర్ సిద్ధంగా లేడు.. మరి జై షా ఆయ‌న్ని ఎలా ఒప్పించారు.?

భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ టీం ఇండియా కోచ్ పదవికి ఆఫర్ వచ్చినప్పుడు తాను పూర్తిగా సిద్ధంగా లేనని వెల్లడించాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో జూలై 2024లో ఆయన ప్రధాన కోచ్ పదవిని చేపట్టారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ముంబైలో ఉన్నప్పుడు తనకు ఈ ఆఫర్ వచ్చిందని, జై షా తనకు ఫోన్ చేసి ఈ బాధ్యతను తీసుకోవాలని కోరాడని గంభీర్ వార్తా సంస్థ ANI పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.

గౌతమ్ గంభీర్ కు అకస్మాత్తుగా హెడ్ కోచ్ పదవి ఆఫర్ వచ్చింది. వార్తా సంస్థ ANI యొక్క పాడ్‌కాస్ట్‌లో సంభాషణ సందర్భంగా, గంభీర్ ఆ సమయంలో ఐపీఎల్ మ్యాచ్ కోసం ముంబైలో బస చేస్తున్నానని చెప్పాడు. మేము ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నట్లు నాకు గుర్తుంది. అది ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ మ్యాచ్. మేము సెయింట్ రెగిస్ హోటల్‌లో బస చేస్తున్నాము. ఆ రోజు ఉదయాన్నే, నాకు జై భాయ్ నుండి కాల్ వచ్చింది. ఆయ‌న‌ ఇలా అన్నాడు, "నీ కోసం నా దగ్గర ఒక ఆఫర్ ఉంది, దాన్ని నువ్వు తిరస్కరించలేవు." ఆ ఆఫర్ ఏంటని నేను అడిగినప్పుడు. "నువ్వు భారత జట్టుకు ప్రధాన కోచ్ అవ్వాలి" అన్నాడు. నిజం చెప్పాలంటే, ఆ సమయంలో నేను దానికి సిద్ధంగా లేను.

టీం ఇండియా ప్రధాన కోచ్ కావడం తనకు గొప్ప గౌరవం అని గంభీర్ అన్నారు. ఎందుకంటే చాలా తక్కువ మంది మాజీ క్రికెటర్లకు భారత డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వెళ్లి దేశం కోసం పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు తన కుటుంబంతో, భార్య నటాషాతో చర్చించానని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు గంభీర్ జై షాకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

తనకు ఆ బాధ్యత అప్పగించినప్పుడు, ఏ జట్టుకూ ప్రధాన కోచ్‌గా పనిచేసిన అనుభవం లేదని, గతంలో తాను మెంటర్ పాత్రలో మాత్రమే పనిచేశానని గంభీర్ అంగీకరించాడు. ఇంత పెద్ద, ఒత్తిడితో కూడిన పదవి కోసం తనను నమ్మడం చాలా పెద్ద విషయమని, ఇప్పటివరకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన అన్నారు.

గంభీర్ తన పదవీకాలంలో కష్టకాలం గురించి గుర్తుచేసుకున్నాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాపై స్వదేశంలో వ‌చ్చిన‌ పరాజయాలు చాలా నిరాశపరిచాయని చెప్పాడు. ఆ క్లిష్ట సమయాల్లో చాలా తక్కువ మంది తనను సంప్రదించారని, కానీ జై షా తనకు ఫోన్ చేసి ప్రోత్సహించారని ఆయన అన్నారు.

ముంబైలో న్యూజిలాండ్ చేతిలో మేము ఓడిపోయినప్పుడు, నేను విమానాశ్రయానికి వెళ్తున్నాము. ఆ సమయంలోనే నాకు జై షా నుండి కాల్ వచ్చింది. అతను ఫోన్‌లో "బలంగా ఉండు, నేను నీతోనే ఉన్నాను." తరువాత, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత.. అతను నాకు మళ్ళీ ఫోన్ చేశాడు.. ఆ సమయంలో కూడా నేను చాలా నిరాశ చెందాను..

మంచి సమయాల్లో చాలా మంది మీతో ఉంటారని, కానీ కష్ట సమయాల్లో మీకు మద్దతు ఇచ్చే వ్యక్తిని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల‌ని ఆయన అన్నారు.

Next Story