జాతీయ క్రీడల విజేతలకు భారీ నగదు ప్రోత్సాహకాలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. జాతీయ క్రీడల్లో పతక విజేతల ప్రైజ్ మనీని పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. క్రీడాకారులను ఆదుకుని ఉన్నత శిఖరాలను అందుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఉత్తరాఖండ్‌లో జరిగిన 38వ జాతీయ క్రీడల్లో రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారులకు నగదు పురస్కారాలను ప్రదానం చేసిన సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. 'బంగారు పతక విజేతలకు రూ.7 లక్షలు, రజత పతక విజేతలకు రూ.5 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ క్రీడల్లో కర్ణాటక 34 స్వర్ణాలు, 18 రజతాలు, 28 కాంస్యాలతో పతకాల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఇది మనందరికీ గర్వకారణం. తదుపరి గేమ్‌లలో కర్ణాటక మొదటి స్థానం సాధిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సిద్ధరామయ్య గతంలో 2015లో తన హయాంలో బంగారు, రజత, కాంస్య పతక విజేతలకు వరుసగా రూ.5 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 2 లక్షల నగదు పురస్కారాలు ప్రకటించామని గుర్తు చేశారు. ఈ మొత్తాన్ని పెంచాలని కర్ణాటక ఒలింపిక్ సంఘం కోరింది. మేము వారి అభ్యర్థనను అంగీకరించాము. మొత్తాన్ని సవరించాము. అథ్లెట్లు పతకాలు సాధించేందుకు సహకరించే మేనేజర్లు, కోచ్‌లకు కూడా రివార్డులు అందజేస్తామని సిద్ధరామయ్య తెలిపారు. 'రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందజేస్తుంది. క్రీడాకారుల డిమాండ్లను మొదటి నుంచి నెరవేరుస్తున్నామని తెలిపారు. పతకాలు సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటా నుంచి పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ ఎస్పీగా నియమితులైన సునీల్ భాటిని ఉదాహరణగా చెబుతూ.. 'ఉన్నత పదవులకు పదోన్నతి పొందే అవకాశాలు కూడా లభిస్తాయి' అన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికల్లో దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారులకు కూడా బహుమతులు అందజేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 'ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన వారికి రూ. 5 కోట్లు, రజత పతక విజేతలకు రూ. 3 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ. 2 కోట్లు బహుమతిగా అందజేస్తాం' అని తెలిపారు.