SRH-HCA వివాదంపై సీఎం సీరియస్..విజిలెన్స్ విచారణకు ఆదేశం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య ఏర్పడిన వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

By Knakam Karthik
Published on : 31 March 2025 5:52 PM IST

Hyderabad News, Cm Revanthreddy, Telangana Government, Hyderabad Cricket Association, Sunrisers Hyderabad, IPL Tickets,

SRH-HCA వివాదంపై సీఎం సీరియస్..విజిలెన్స్ విచారణకు ఆదేశం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య ఏర్పడిన వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసినట్లు..హెచ్‌సీఏపై వస్తోన్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు. ఐపీఎల్ టికెట్లు, పాస్‌ల కోసం HCA వేధిస్తోందని SRH ఆరోపణలు చేసింది. అయితే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయాలపైనా కొంతకాలంగా HCAపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

అసలు వివాదం ఏంటి?

ఉచిత పాస్‌ల కోసం హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) త‌మ‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంద‌ని, అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న‌రావు ప‌లుమార్లు బెదిరించార‌ని ఇలాగైతే తాము హైద‌రాబాద్ వ‌దిలి వెళ్లిపోతామ‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్) హెచ్చ‌రించింది. ఈ మేర‌కు హెచ్‌సీఏ కోశాధికారికి ఎస్ఆర్‌హెచ్ ప్ర‌తినిధి లేఖ రాశారు. కోరిన‌న్ని పాస్‌లు ఇవ్వ‌నందుకు ఇటీవ‌ల కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేసిన విష‌యాన్ని లేఖ ద్వారా స‌న్‌రైజ‌ర్స్ బ‌య‌ట‌పెట్టింది. మ్యాచ్ ప్రారంభం కావ‌డానికి గంట ముందు వ‌ర‌కు దాన్ని తెర‌వ‌లేద‌ని తెలిపింది. మ్యాచ్ మొద‌ల‌వ‌బోతుండ‌గా ఇలా బ్లాక్‌మెయిల్ చేయ‌డం అన్యాయ‌మ‌ని చెప్పింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయ‌డం క‌ష్ట‌మ‌ని పేర్కొంది. దీన్ని సంఘం దృష్టికి కూడా తీసుకొచ్చామ‌ని, అధ్య‌క్షుడి ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌ట్టి చూస్తే ఈ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ ఆడ‌టం ఇష్టం లేన‌ట్లుగా ఉంద‌ని తెలిపింది. అదే ఉద్దేశ‌మైతే బీసీసీఐ, తెలంగాణ ప్ర‌భుత్వంతో సంప్ర‌దించి మ‌రో వేదిక‌కు మారిపోతామ‌ని పేర్కొంది. తాజాగా దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని మండిపడ్డారు.

Next Story