ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత సందేశంతో మేల్కొన్నాను : క్రిస్ గేల్‌

Chris Gayle wishes India on 73rd Republic Day.వెస్టిండీస్ స్టార్ క్రికెట‌ర్‌, యూనివ‌ర్స‌ల్ బాస్, విధ్వంస‌క వీరుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2022 12:08 PM IST
ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత సందేశంతో మేల్కొన్నాను : క్రిస్ గేల్‌

వెస్టిండీస్ స్టార్ క్రికెట‌ర్‌, యూనివ‌ర్స‌ల్ బాస్, విధ్వంస‌క వీరుడు క్రిస్‌గేల్ కు భార‌తదేశం అంటే ప్రత్యేక అభిమానం ఉంది. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో గేల్ చెప్పాడు. బుధ‌వారం 73వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని దేశ ప్ర‌జ‌ల‌కు క్రిస్‌గేల్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి తనకు వ్యక్తిగత సందేశం అందిందని చెప్పాడు.

'ఈ రోజు ఉద‌యం భారత దేశ ప్ర‌ధాని పంపిన ప‌ర్స‌న‌ల్ మెసేజ్‌తో నిద్ర లేచా. 73వ గణతంత్ర దినోత్సవం జ‌రుపుకుంటున్న భార‌తీయుల‌కు ఇవే నా శుభాకాంక్ష‌లు. ప్ర‌ధాని మోదీతో పాటు ప్ర‌జ‌ల‌తో నాకు విడ‌దీయ‌రాని బంధం ఉంది. మీరంటే నాకు ప్ర‌త్యేక‌మైన అభిమానం. కంగ్రాట్స్‌ ఫ్రమ్‌ యునివర్సల్‌ బాస్ 'అంటూ క్రిస్‌గేల్ ట్వీట్ చేశాడు.

42 ఏళ్ల ఈ విండీస్ వీరుడు ఇండియ‌న్ ప్రీమియ‌ర్‌(ఐపీఎల్‌)లో త‌న‌దైన బ్యాటింగ్‌తో భార‌త అభిమానుల‌కు అల‌రించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి), పంజాబ్ కింగ్స్ (పిబికెఎస్) త‌రుపున ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వ‌హించాడు. కాగా.. ఆర్‌సీబీ త‌రుపున గేల్ 91 మ్యాచ్‌లు ఆడి 154.40 స్ట్రైక్ రేట్‌తో 3,420 పరుగులు చేశాడు. ఆ జ‌ట్టు త‌రుపున విరాట్ కోహ్లీ, డివిలియ‌ర్స్ త‌రువాత అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా గేల్ నిలిచాడు. కాగా.. ఈ ఏడాది వేలం జాబితాలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ పేరు లేకపోవడంతో ఐపిఎల్‌లో గేల్‌ను ఇక చూడ‌లేం. ఇక వెస్టిండీస్ తరుపున‌ 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టీ20లకు గేల్ ప్రాతినిథ్యం వహించాడు. అతను ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు.

Next Story