ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాక్‌ సెమీస్‌కు అర్హత సాధించాలంటే.?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

By Medi Samrat  Published on  20 Feb 2025 2:30 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాక్‌ సెమీస్‌కు అర్హత సాధించాలంటే.?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కరాచీలో న్యూజిలాండ్ చేతిలో ఆతిథ్య జట్టు 60 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలు దెబ్బ తిన్నాయి. మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఓటమితో గ్రూప్-ఎలో చివరి స్థానానికి చేరుకుంది. పాకిస్థాన్ నెట్ రన్ రేట్ -1.200గా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫార్మాట్ ప్రతి మ్యాచ్ ముఖ్యమైనది. ఒక ఓటమి కూడా జట్టును ముంచెత్తేస్తుంది.

పాకిస్థాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే.. గ్రూప్ దశలో తన తదుపరి రెండు మ్యాచ్‌లను గెలవాలి. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లోనైనా పాకిస్థాన్ ఓడితే.. సెమీస్‌ చేరుకోవడం దాదాపు అసాధ్యం. అయితే పాకిస్తాన్ తన తదుపరి రెండు మ్యాచ్‌లను గెలిచినా.. సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం గ్యారెంటీ కాదు ఎందుకంటే అది నెట్ రన్ రేట్‌పై ఆధారపడి ఉంటుంది.

పాకిస్థాన్ నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. న్యూజిలాండ్‌తో జరిగిన ఓటమితో పాకిస్థాన్ నెట్ రన్ రేట్ నెగిటివ్‌గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్. 2017లో ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ టైటిల్ గెలుచుకుంది.

పాకిస్థాన్ ఎలా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.?

వచ్చే రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ ఓడిపోతే టోర్నీ నుంచి ఔట్ అవుతుంది.

రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిస్తే.. సెమీస్‌ చేరుకోవడానికి పాకిస్థాన్ నెట్ రన్ రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.

రెండు మ్యాచ్‌లు గెలిస్తే క్వాలిఫై అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. నెట్ రన్ రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.

సెమీఫైనల్‌కు చేరుకునే మార్గం పాకిస్థాన్‌కు అంత సులభం కాదు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్.. ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య పోరు జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ విజయాన్ని నమోదు చేయడం అంత సులువు కాదు.

కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పాకిస్థాన్ జట్టు 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది.

Next Story