అలా చేసివుంటే ఫ‌లితం వేరేలా ఉండేది.. ఓట‌మికి కార‌ణం చెప్పిన కివీస్ కెప్టెన్‌

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

By Medi Samrat
Published on : 10 March 2025 7:09 AM IST

అలా చేసివుంటే ఫ‌లితం వేరేలా ఉండేది.. ఓట‌మికి కార‌ణం చెప్పిన కివీస్ కెప్టెన్‌

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ ఓటమి తర్వాత కివీస్‌ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బాధలో ఉన్నాడు. న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ మొత్తం పోరాడుతూనే ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గెలవడానికి శాయశక్తులా ప్రయత్నించాం.. కానీ రోహిత్ శర్మ మా నుండి విజయాన్ని లాగేసుకున్నాడు అని పేర్కొన్నాడు.

ఫైన‌ల్లో ఓటమి తర్వాత కివీస్ కెప్టెన్ భారత స్పిన్నర్లపై ప్రశంసలు కురిపించాడు. అలాగే, తమ జట్టు 25 పరుగులు తక్కువ చేసిందని తెలిపాడు. స్కోరు ఎక్కువగా ఉంటే, ఫలితం భిన్నంగా ఉండేద‌న్నాడు. ఇది పెద్ద‌ టోర్నమెంట్. టోర్నీలో మేము అనేక సవాళ్లను ఎదుర్కొన్నాము.. కానీ మేము జట్టుగా ఎదిగాము.. మంచి క్రికెట్ ఆడాము. మంచి జట్టుగా ఓడిపోయాం. (మిడిల్ ఆర్డర్‌లో స్లో బ్యాటింగ్‌పై) అది అద్భుతమైన బౌలింగ్. పవర్‌ప్లేలో కొన్ని వికెట్లు కోల్పోయాం. పూర్తి క్రెడిట్ భార‌త‌ నలుగురు స్పిన్నర్లకు చెందుతుంది. వారు ప్రపంచ స్థాయి బౌలింగ్ చేశారు.

మేము మ‌రో 25 పరుగులు చేయాల్సివుంది.. కానీ ఇది మంచి స్కోరు, మేము పోరాడటానికి ప్రయత్నించాము.. అదే మేము చేసాము. (ఫిలిప్స్ క్యాచ్‌పై) అతడు మంచి ఫీల్డింగ్‌ చేస్తూనే ఉన్నాడు, కాదా? పవర్‌ప్లే బ్యాటింగ్ చేయడానికి ఉత్తమ సమయం, రోహిత్, గిల్ దానిని సద్వినియోగం చేసుకున్నారు, రోహిత్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంది. అది మమ్మల్ని వెనుకకు నెట్టింది.. అయితే ఆట త్వరగా మారుతుందని మాకు తెలుసు. మేము వికెట్లు తీయడం కొనసాగించాము.. ఆటలో కొనసాగామని పేర్కొన్నాడు.

ఆదివారం (మార్చి 9) జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టైటిల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీటుగా భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Next Story