జస్ప్రీత్ బుమ్రా.. వరల్డ్ క్లాస్ బౌలర్. అతడు జట్టులో ఉంటే ఎంతో బలం. అయితే వెన్ను నొప్పి కారణంగా ఆసియా కప్ కు దూరమైన బుమ్రా.. ఇప్పుడు వరల్డ్ కప్ కూడా ఆడడం లేదనే వార్త భారత క్రికెట్ అభిమానులను ఎంతగానో కలవరపెడుతోంది. అయితే బుమ్రా వరల్డ్ కప్ ఆడే అవకాశాలు పూర్తిగా మూసుకుపోలేదని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. బుమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరం కాలేదని స్పష్టం చేశారు. వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉన్నందున, టోర్నీలో బుమ్రా ఆడే అవకాశాలను ఇప్పుడే కొట్టిపారేయలేమని అన్నారు. బుమ్రా అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16నే ప్రారంభం కానుంది.. టీమిండియా తన తొలి మ్యాచ్ ను అక్టోబరు 23న పాకిస్థాన్ తో ఆడనుంది. ఈ లోపు బుమ్రా కోలుకోవచ్చని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.
ఇటీవలి కాలంలో చాలా తక్కువగా ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడుతున్న బుమ్రాను సెలెక్టర్లు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నుండి ఆఖరి నిమిషంలో తప్పించారు. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ కు స్థానం కల్పించారు. బుమ్రా వీపు భాగంలో ఓ ఎముకలో స్వల్ప పగులు ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే బుమ్రాకు 6 నెలల విశ్రాంతి అవసరమంటూ వార్తలు వచ్చాయి.