తడబడ్డ కుర్రాళ్లు.. పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి

యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్‌-19 ఆసియాకప్‌లో టీమిండియాకు ఆదివారం నిరాశే ఎదురైంది.

By Medi Samrat  Published on  10 Dec 2023 3:30 PM GMT
తడబడ్డ కుర్రాళ్లు.. పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి

యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్‌-19 ఆసియాకప్‌లో టీమిండియాకు ఆదివారం నిరాశే ఎదురైంది. పాకిస్థాన్ వరుసగా రెండో విక్ట‌రీ నమోదు చేసి భారత జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అనంతరం పాక్‌ 47 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సెంచరీ ఇన్నింగ్సు ఆడి అజాన్ అవైస్ పాకిస్థాన్ కు హీరో అయ్యాడు.

భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన యువ భార‌త్‌ సెమీఫైనల్‌కు దూరమయ్యే ప్రమాదంలో పడింది. అయితే డిసెంబర్ 12న నేపాల్‌తో భార‌త‌ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి, మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించినట్లయితే.. టీమిండియా సెమీఫైనల్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

ఇక ఈ మ్యాచ్ విష‌యానికొస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవ‌ర్ల‌లో కేవలం 259 పరుగులు మాత్రమే చేసింది. భారత్ బ్యాట్స్‌మెన్ల‌లో ఆదర్శ్ సింగ్ (62), కెప్టెన్ ఉదయ్ సహారన్ (60), సిన్ దాస్ 58 పరుగులతో అర్ధ సెంచరీలు ఆడారు. కానీ ఈ ఇన్నింగ్స్‌లు జట్టును 300కు చేర్చలేకపోయాయి. జవాబుగా పాక్‌ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేసింది. వారి టాప్ ఆర్డర్ ఏకంగా మ్యాచ్‌ను భారత్‌కు దూరం చేసింది.

భార‌త్‌ నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన పాక్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. ఓపెనర్ షామాయిల్ హుస్సేన్ త్వ‌ర‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత షాజైబ్ ఖాన్ 63 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అజన్ అవైస్ మ్యాచ్‌ను మ‌లుపుతిప్పే సెంచరీతో అదరగొట్టాడు. నాటౌట్‌గా మిగిలిపోయిన అతడు 130 బంతుల్లో 105 పరుగులతో అజేయ సెంచరీ చేశాడు. 61 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ సాద్ బేగ్ చివరి వరకు అజన్ అవైస్ కు మద్దతుగా నిలిచాడు. పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ డిసెంబర్ 12న ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడనుంది.

Next Story