టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా

Australia Beat South Africa In T20 World Cup. టీ20 వరల్డ్ కప్ లో అబుదాబి వేదిక‌గా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఐదు

By Medi Samrat
Published on : 23 Oct 2021 7:41 PM IST

టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా

టీ20 వరల్డ్ కప్ లో అబుదాబి వేదిక‌గా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జ‌ట్టు నిర్ణిత‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసింది. సఫారీలు నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ 19.4 ఓవర్లలో ఛేదించారు. ఆసీస్‌ బౌలర్ల దాటికి సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ల‌లో మక్రమ్‌(40) మినహా ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఐదుగురు బ్యాటర్స్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా, మిచెల్‌ స్టార్క్‌ తలా రెండు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ తీశారు.

లక్ష్యఛేదనలో ఆసీస్ 20 పరుగులకే ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (0), డేవిడ్ వార్నర్ (14)ల వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ (11) కూడా వెనుదిరగ్గా.. మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 34 బంతుల్లో 35 పరుగులు చేసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. మ్యాక్స్ వెల్ 18 పరుగులు చేయగా, చివర్లో మాథ్యూ వేడ్ (15 నాటౌట్), స్టొయినిస్ (24 నాటౌట్) జోడీ మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించింది. సఫారీ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జే 2, రబాడా 1, కేశవ్ మహరాజ్ 1, తబ్రైజ్ షంసీ 1 వికెట్ తీశారు. మ‌రో మ్యాచ్‌ ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మ‌ధ్య‌ దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతుంది. ఈ పోరులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది.


Next Story