ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఉత్కంఠ పోరులో భారత్ 4-3తో పాకిస్థాన్‌ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇరు జట్లూ మ్యాచ్ లో తమ ఆధిపత్యాన్ని చూపించడానికి ఒకరిపై ఒకరు దూకుడుగా ఆడడంతో మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా కొనసాగింది. పెనాల్టీ కార్నర్ ద్వారా హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో భారతదేశం మంచి ఆరంభాన్ని అందుకుంది. మొదటి క్వార్టర్‌లో భారతదేశం 1-0 ఆధిక్యంలోకి రావడానికి సహాయపడింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆటగాడు అఫ్రాజ్ తన జట్టుకు గోల్ అందించాడు. ఆట మూడో క్వార్టర్‌లో అబ్దుల్ రానా పాకిస్థాన్ రెండో గోల్ చేశాడు.
భారత్ 2-1తో వెనుకబడిన సమయంలో గురుసాహిబ్జిత్ సింగ్, వరుణ్ కుమార్ లు రెండు గోల్స్ అందించారు. దీంతో భారత్ 3-2 ఆధిక్యాన్ని పొందింది. ఆకాశ్‌దీప్ సింగ్ భారత్‌కు చివరి గోల్ చేసి భారత్‌ను 4-2తో ఆధిక్యంలో ఉంచాడు. ఆఖర్లో పాక్ మరో గోల్ చేయడంతో ఆధిక్యం కాస్త తగ్గింది. ఈ మ్యాచ్ విజయం ద్వారా టోర్నీని భారత్ మూడో స్థానంలో టోర్నీని ముగించింది. రౌండ్-రాబిన్ దశలో భారత్ అద్భుతంగా ఆడింది. అయితే సెమీ-ఫైనల్‌లో భారత్ 3-5తో జపాన్‌తో షాకింగ్ ఓటమిని చవిచూసింది. ఇంతలో, పాకిస్తాన్ తన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో 5-6 థ్రిల్లర్‌తో ఓడిపోయింది.