వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఇతర సెలక్టర్లు 15 మంది ఆటగాళ్లను ప్రకటించారు. జట్టు ఎంపిక పట్ల కొందరు ఆటగాళ్లు నిరాశ చెందగా, మరికొందరు సంతోషంగా ఉన్నారు. కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాల్సి వచ్చిందని, అందుకే చాలా మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం దురదృష్టకరమని అజిత్ అగ్కర్ విలేకరుల సమావేశంలో అన్నారు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్ మళ్లీ టీ20 జట్టులోకి వచ్చాడు. గిల్ చాలా కాలం పాటు భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడు 30 జూలై 2024న పల్లెకెలెలో శ్రీలంకతో తన చివరి T20 మ్యాచ్ ఆడాడు. గిల్‌కు ఆసియా కప్-2025 జట్టులో స్థానం లభించింది. వైస్ కెప్టెన్ బాధ్యత కూడా అతనికి ఇవ్వబడింది. ఐపీఎల్-2025లో అతని బలమైన ప్రదర్శనే ఇందుకు కారణం.
ఈ జట్టులో భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు చోటు దక్కలేదు. తొలి వికెట్ కీపర్‌గా సంజు శాంసన్, రెండో వికెట్‌కీపర్‌గా జితేష్ శర్మ ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన పంత్ చివరి టెస్టు మ్యాచ్ ఆడలేదు. బహుశా అతను ఇంకా ఫిట్‌గా లేడు.
ఇంగ్లండ్ పర్యటనలో తన బౌలింగ్‌తో టీమిండియా పునరాగమనం చేసిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. అలాగే యశస్వి జైస్వాల్ కూడా జట్టుకు దూరమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ పేరు కూడా లేదు. ఇది ఆశ్చర్యకరం. ఎందుకంటే అతడు ఐపిఎల్‌లో బలమైన ప్రదర్శన చేశాడు. స్పిన్ ఆల్‌రౌండర్ కోసం వెళ్లడంతో అయ్యర్‌ను పక్కనపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే పిచ్‌లపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆసియా కప్ ఆడాల్సి ఉంది. ఈ కారణంగానే జట్టులో స్పిన్నర్లకు ప్రాధాన్యం ఇచ్చారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రూపంలో ఇద్దరు స్వచ్ఛమైన స్పిన్నర్లు ఉండగా, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ ఆల్ రౌండర్ ఉన్నాడు. అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. స్పిన్ బౌలర్ కావడంతోనే యశస్వి కంటే అభిషేక్ శర్మకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నాడు.