రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. గత 16 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేదు. గత సీజన్‌లో ఆ జట్టు ప్లేఆఫ్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. దీంతో ప్రధాన కోచ్ సంజయ్ బంగర్, జట్టు డైరెక్టర్ మైక్ హెస్సన్‌పై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ హెస్సన్, బంగర్‌లను తొలగించింది. జింబాబ్వే మాజీ ఆటగాడు, గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రధాన కోచ్ అయిన ఆండీ ఫ్లవర్‌ను జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది.
లక్నో సూపర్‌జెయింట్స్ ఇటీవలే ఆండీ ఫ్లవర్ ను విడిచిపెట్టింది. అతని స్థానంలో జస్టిన్ లాంగర్ లక్నో ప్రధాన కోచ్‌గా నియమించింది. ఆండీ ఫ్లవర్ నియామకంపై ఆర్సీబీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించింది. మేము ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్.. ఇంగ్లాండ్ టీ20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆండీ ఫ్లవర్ ను ప్రధాన కోచ్‌గా స్వాగతిస్తున్నామని పేర్కొంది. ఐపీఎల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక టీ20 జట్లకు కోచ్‌గా పనిచేసిన ఆండీ ఫ్లవర్ అనుభవం.. అర్సీబీకి టైటిల్ గెలవడంలో సహాయపడగలదు. ఆయన గెలవాలనే మనస్తత్వం ఆర్సీబీ ముందుకు సాగడానికి సహాయపడుతుందని వెల్లడించింది.