ఎట్ట‌కేల‌కు తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడిన అమ్మాయిలు..!

మహిళల టీ20 ప్రపంచకప్‌లో కొత్త ఛాంపియన్ ఎవరో ఇప్పుడు వెల్లడైంది

By Medi Samrat  Published on  21 Oct 2024 1:45 AM GMT
ఎట్ట‌కేల‌కు తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడిన అమ్మాయిలు..!

మహిళల టీ20 ప్రపంచకప్‌లో కొత్త ఛాంపియన్ ఎవరో ఇప్పుడు వెల్లడైంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుపై 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.

న్యూజిలాండ్ జట్టు మహిళల T20 ప్రపంచకప్ 2009, 2010 సీజ‌న్‌ల‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. 2009లో ఇంగ్లండ్‌తోనూ, 2010లో ఆస్ట్రేలియా చేతిలోనూ ఓడిపోయింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు చేరుకోవడంలో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. అయితే టైటిల్ గెలవాలన్న ప్రొటీస్ జట్టు కలను ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఛేదించింది. దక్షిణాఫ్రికా వరుసగా రెండోసారి ఫైనల్‌లో ఓటమిని చవిచూసింది.

ఇక ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అమీలియా కెర్ అత్యధికంగా 43 పరుగులు చేసింది. అనంత‌రం దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు జట్టు స్కోరు 16 వద్ద తొలి ఎదురుదెబ్బ తగిలింది. అయితే తర్వాత జట్టు కోలుకుంది జార్జియా ప్లిమ్మర్ 9 పరుగులు మాత్ర‌మే చేసింది. స్కోరు 53 సుజీ బేట్స్ బౌల్డ్ అయింది. సుజీ 31 బంతుల్లో 32 పరుగులు చేసింది. 11వ ఓవర్లో కెప్టెన్ సోఫీ డివైన్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యింది. 10 బంతుల్లో 6 పరుగులు చేసింది. బ్రూక్ హాలిడే 38 పరుగులు, అమేలియా కెర్ 38 బంతుల్లో 43 పరుగులు చేయ‌డంతో స్కోరు 150 ప‌రుగులు దాటింది.

159 పరుగుల భారీ స్కోరును ఛేదించేందుకు దక్షిణాఫ్రికాకు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్లు లారా వోల్వార్డ్, తజ్మిన్ బ్రిట్స్ తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించారు. 7వ ఓవర్లో బ్రిట్స్ అవుటయ్యింది. 18 బంతుల్లో 17 పరుగులు చేసింది. 10వ ఓవర్లో కెప్టెన్ లారా క్యాచ్ ఔట్ అయ్యింది. 27 బంతుల్లో 33 పరుగులు చేసింది. ఆ తర్వాత వికెట్ల వర్షం కురిసింది. అన్నెకే బాష్ 9, మారిజ్నే కాప్ 8, నాడిన్ డి క్లెర్క్ 6, సునే లూస్ 8, అనెరి డెర్క్‌సెన్ 10, సినాలో జాఫ్తా 6 పరుగులు చేశారు. అమేలియా కెర్‌, రోజ్‌మేరీ మైర్‌లు చెరో 3 వికెట్లు తీశారు. ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్, బ్రూక్ హాలిడే త‌లా ఒక వికెట్ సాధించారు.

Next Story