నాన్న జీతం స‌రిపోయేది కాదు.. క‌ష్టాల‌ను గుర్తుచేసుకున్న స్టార్ క్రికెట‌ర్..!

భారత క్రికెట్‌లో అజింక్యా రహానే పేరుకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రహానే క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

By Medi Samrat  Published on  17 Feb 2025 6:39 PM IST
నాన్న జీతం స‌రిపోయేది కాదు.. క‌ష్టాల‌ను గుర్తుచేసుకున్న స్టార్ క్రికెట‌ర్..!

భారత క్రికెట్‌లో అజింక్యా రహానే పేరుకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రహానే క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే అతడు టెస్ట్ క్రికెట్‌లో తన నిజమైన ముద్రను వేశాడు. అయితే, ప్రస్తుతం అజింక్యా రహానే ఏ ఫార్మాట్‌లోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌డం లేదు. అయితే.. 36 ఏళ్ల రహానే జాతీయ జట్టులోకి పునరాగమనంపై ఆశలు వదులుకోలేదు.

రహానే దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. తద్వారా అతడు అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవ‌కాశం ఉంది. జీవితంలో ఎన్నో విష‌యాల్లో రాజీప‌డిన‌ రహానేకు.. ప్రశాంతంగా ఎలా ఉండాలో, అవకాశం కోసం ఎదురుచూడాలో తెలుసు.

రహానే ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. "నేను డోంబివాలి నుండి వచ్చాను. నాకు రైలులో ప్రయాణించడం సవాలుగా ఉండేది.. మా నాన్న ఆఫీసుకు వెళ్లాలి.. కాబట్టి నేను 8 సంవత్సరాల వయస్సు నుంచే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను. నేను దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని.. మా నాన్న జీతం మాకు స‌రిపోయేది కాదు... ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనస్సులో ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడూ స్థిరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. క్రికెట్‌ వల్లనే ఇంత పేరు, డబ్బు వచ్చిందని త‌న క‌ష్టాల‌ను గుర్తుచేసుకున్నాడు.

అజింక్య రహానే తన కెప్టెన్సీలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. కెప్టెన్‌గా తన మనస్తత్వం ఎలా ఉంటుందో రహానే చెప్పాడు. ఎవరి వ్యక్తిగత జీవితంలోనూ జోక్యం చేసుకోవడం సరికాదు.. అయితే నాయకుడిగా నేను చెప్పవలసి వస్తే చెబుతాను అని రహానే అన్నాడు. నేను ప్రతిభావంతులైన చాలా మంది ఆటగాళ్లను చూశాను.. కానీ తప్పుడు నిర్ణ‌యాలు.. తప్పుడు స్నేహితుల కారణంగా.. వారు తప్పుదారి పట్టారు.

మనం ఎక్కడ నుండి వచ్చామో మనం మరచిపోకుండా ఉండటం ముఖ్యం. ఒక ఆటగాడు ఇత‌రుల‌తో సరదాగా గడిపితే.. అతడికి ప్రజల నుండి చాలా మద్దతు లభిస్తుందని మ‌నం చూస్తుంటాం.. అకస్మాత్తుగా ఏదైనా తప్పు జరిగితే.. అదే వ్యక్తులు మద్దతు ఇవ్వరు. కాబట్టి మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నాడు.

అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తింపు పొందిన సమయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. అతడు భారత జ‌ట్టులో అరంగేట్రం చేసినప్పుడు, సెకండ్ హ్యాండ్ వాగ్నర్ కారు కొన్నానని చెప్పాడు. కుటుంబ విలువలు ఇక్కడ అమలులోకి వస్తాయి.. తల్లిదండ్రులు ఖర్చు చేయవద్దు అని ఎప్పుడూ చెప్పరు., కానీ అవసరాన్ని బట్టి ఖర్చు చేయమని చెబుతారు. నేను నా జీవితంలో చాలా ఆలస్యంగా కారు కొన్నాను. ఇంతకు ముందు నేను నీలేష్ కులకర్ణి, ఆవిష్కర్ సాల్వి, ప్రవీణ్ తాంబేలను లిఫ్ట్ అడిగేవాడిని.. నేను ఇండియా తరఫున మొద‌టిసారి ఆడినప్పుడు సెకండ్ హ్యాండ్ వాగ్నర్ కారు కొన్నాను. అంద‌రూ పెద్ద కారు కొనమని చెప్పారు.. కానీ నేను అందులో హాయిగా ప్రయాణించేవాడిని.. తెలివిగా పెట్టుబడి పెట్టాలనుకున్నాను.. రెండేళ్ల తర్వాత హోండా సిటీ కారు కొన్నాను తెలిపాడు.

Next Story