క్రికెట‌ర్ ఇంట్లో తీవ్ర‌ విషాదం.. రెండున్నరేళ్ల కుమార్తె మృతి

ఆఫ్ఘనిస్థాన్‌ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ హజ్రతుల్లా జజాయ్‌ రెండున్నరేళ్ల కుమార్తె మృతి చెందింది.

By Medi Samrat
Published on : 14 March 2025 1:41 PM IST

క్రికెట‌ర్ ఇంట్లో తీవ్ర‌ విషాదం.. రెండున్నరేళ్ల కుమార్తె మృతి

ఆఫ్ఘనిస్థాన్‌ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ హజ్రతుల్లా జజాయ్‌ రెండున్నరేళ్ల కుమార్తె మృతి చెందింది. అతని సన్నిహితుడు.. జాతీయ జ‌ట్టు సహచరుడు కరీం జనత్ సోషల్ మీడియాలో విచారకరమైన వార్తను పంచుకున్నారు. కరీం జనత్ త‌న పోస్టుద్వారా జజాయ్, అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఆటగాళ్ళు హజ్రతుల్లాకు సానుభూతి, మద్దతు సందేశాలను పంపారు.

జనత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశాడు.. నా సన్నిహితుడు, సోదరుడు హజ్రతుల్లా జజాయ్ తన కుమార్తెను కోల్పోయాడనే వార్త‌ను మీతో పంచుకోవడానికి చాలా బాధగా ఉంది. ఈ క్లిష్ట సమయంలో నా హృదయం అతనికి, అతని కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ విషాద సమయంలో మీరు కూడా హజ్రతుల్లా కుటుంబం కోసం ప్రార్థించండి. హజ్రతుల్లా జజాయ్.. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని పేర్కొన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొన్న‌ ఆఫ్ఘన్ జట్టులోకి హజ్రతుల్లా ఎంపిక కాలేదు. 2016లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరిగిన ODI మ్యాచ్‌తో హజ్రతుల్లా అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. అప్పటి నుండి 16 ODIలు, 45 T20 మ్యాచ్‌లు ఆడాడు. డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 11 ఫోర్లు, 11 సిక్సర్ల సహాయంతో 162 పరుగులు చేయడం ద్వారా జజాయ్ అంతర్జాతీయ T20 మ్యాచ్‌ల‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆట‌గాళ్ల‌ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.

26 ఏళ్ల జజాయ్ ఈ ఏడాది ఆఫ్ఘనిస్థాన్ తరఫున క్రికెట్ ఆడలేదు. డిసెంబర్ 2024లో జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్ నుండి అతను జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. 16 ODIల‌లో 361 ప‌రుగులు, 45 T20Iలలో 1,160 పరుగులు చేశాడు.

Next Story