భుజం గాయం కారణంగా ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పటికే సీజన్ దారుణంగా ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కు ఈ వార్త భారీ ఎదురుదెబ్బ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అంతగా కలిసి రాలేదు. రాజస్థాన్ రాయల్స్ (RR)పై విజయంతో సీజన్‌ను ప్రారంభించిన హైదరాబాద్, ఆ తర్వాత వరుసగా నాలుగు పరాజయాలను సొంతం చేసుకుంది.
2025 ఐపీఎల్ సీజన్‌లో మిగిలిన మ్యాచ్ లకు ఆడమ్ జంపా స్థానంలో స్మరన్ రవిచంద్రన్‌ను తీసుకున్నట్లు SRH ప్రకటించింది. కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ స్మరన్‌ను ₹30 లక్షల బేస్ ధరకు జట్టులోకి తీసుకున్నారు. స్మరన్ అన్ని ఫార్మాట్లలో రాణిస్తూ ఉన్నాడు. దేశీయ క్రికెట్‌లో 1,100 పరుగులకు పైగా సాధించాడు. ఇటీవలి రంజీ ట్రోఫీ సీజన్‌లో, అతను ఏడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 64.50 సగటుతో 516 పరుగులు చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో 10 మ్యాచ్‌ల్లో 72.16 సగటుతో 433 పరుగులు చేశాడు.