క్రికెట్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. చాలా కాలం తరువాత కిక్కిరిసిన స్టేడియంలో టీమ్ఇండియా మ్యాచ్ ఆడనుంది. కరోనా మహమ్మారి కాలంగా ఇప్పటి వరకు చాలా మ్యాచులు ప్రేక్షకులు లేకుండానే జరిగాయి. అయితే ఇప్పుడు కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోవడంతో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య ప్రారంభం కానున్న రెండో టెస్టు(డే అండ్ నైట్) కు వంద శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
కోహ్లీకి వందో మ్యాచ్ అయిన తొలి టెస్టులో 50 శాతం ప్రేక్షకులకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండో టెస్టుకు మంచి డిమాండ్ ఉందని, దీంతో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అనుమతించేందుకు సంతోషంగా ఉన్నామని నిర్వాహకులు తెలిపారు. కాగా.. రెండో టెస్టుకు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైనట్లు సమాచారం.
కోహ్లి స్వస్థలం ఢిల్లీ అయినప్పటికి బెంగళూరు అతని హోమ్ గ్రౌండ్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతూ వస్తుండడమే అందుకు కారణం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చాలా కాలం తరువాత స్వదేశంలో టీమ్ఇండియా పింక్ బాల్ మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచి మంచి ఊపుమీదున్న రోహిత్ సేన.. రెండో టెస్టులోనూ విజయం సాధించి 2-0 తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని బావిస్తోంది.