ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్‌డౌన్‌ కారణంగా వసల కూలీలు నానా అవస్థలకు గురవుతున్నారు. ఇక ఆయా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థులు, వలస కూలీలు, ఇతర కార్మికులను సొంత గ్రామాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, ఇతర వారిని సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం ప్రత్యేక నాన్‌ స్టాప్‌ రైళ్లను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సహా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వలస కార్మికుల తరలింపునకు బుధవారం కేంద్ర సర్కార్‌ అనుమతి ఇచ్చింది. ఇక బస్సుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని తరలించేందుకు మార్గదర్శకాలను సైతం జారీ చేసింది.

లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాది మంది కార్మికులను బస్సుల్లో తరలించడం ఇబ్బందికరమైన విషయమని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు.. నాన్‌స్టాప్‌ రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశాయి. ఒక వేళ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తే వలస కూలీలకు, కార్మికులకు భారీ ఊరట నిచ్చినట్లవుతుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.