రజినీకాంత్ ఫౌండేషన్ ను మొదలు పెట్టేశారు
Rajinikanth launches his foundation with official website. ప్రముఖ నటుడు రజినీకాంత్ తన ఆశయ సాధనలో భాగమైన 'రజినీకాంత్ ఫౌండేషన్'ని ప్రారంభించారు.
By అంజి Published on 28 Dec 2021 9:10 PM ISTప్రముఖ నటుడు రజినీకాంత్ తన ఆశయ సాధనలో భాగమైన 'రజినీకాంత్ ఫౌండేషన్'ని ప్రారంభించారు. ఇది 'సమాజంలోని అట్టడుగు వర్గాల యువతకు విద్య, సాధికారత ఉపాధి కల్పించడం' లక్ష్యంగా మొదలుపెట్టారు. rajinikanthfoundation.org వెబ్‌సైట్ ప్రకారం, ఇది యువతకు కెరీర్ మార్గాలను ఎంచుకోవడం.. వారి లక్ష్యాల కోసం శిక్షణ కోసం ఆర్థిక సహాయం చేయడం..! వారి ప్రతిభను పెంపొందించడానికి మార్గాలను అందిస్తుంది. "సూపర్ 100 బ్యాచ్" కోసం TNPSC గ్రూప్ పరీక్ష శిక్షణ కోసం ఉచితంగా రిజిస్ట్రేషన్‌ను ప్రకటించడం సంతోషంగా ఉందని ఫౌండేషన్ తెలిపింది.
డిసెంబర్ 26న, తన ఫౌండేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు రజినీ. ఈ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్‌పీఎస్‌సీ) నిర్వహించే పలు పోటీ పరీక్షలకు సంబంధించి 100 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. "సూపర్ 100బ్యాచ్ పేరుతో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం. సామాజిక అసమానతలను రూపుమాపడానికి రజనీకాంత్ ఫౌండేషన్ విశేషంగా కృషి చేస్తోంది. ఫౌండేషన్ కార్యకలాపాలపై గ్లోబల్‌గా మా విజన్ ఉన్నప్పటికీ ప్రస్తుతం తమిళనాడుకు మాత్రమే మా సేవలు పరిమితం చేస్తున్నాం. తమిళనాడు ప్రజల కారణంగానే రజనీకాంత్‌కు పేరు ప్రతిష్ఠలు లభించాయి. అందువల్ల ఫౌండేషన్ అందించే ఏ సహాయం అయినా తమిళనాడు నుంచే ప్రారంభమవుతుంది" అని ఫౌండేషన్ పత్రికా ప్రకటనలో తెలిపారు.
పాలన, ప్రగతిశీల ఆలోచన, నాయకత్వ శ్రేష్టత, శాస్త్రీయ దృక్పథంతో నిర్మించబడిన సమాజాన్ని రూపొందించడానికి పేద మరియు అణగారిన వర్గాల విద్యను ఒక సాధనంగా ఉపయోగించేందుకు సూపర్ స్టార్ పద్మవిభూషణ్ రజినీకాంత్ ఈ ఫౌండేషన్ ను స్థాపించారు. రజనీకాంత్ చివరిగా 'అన్నాత్తే'లో కనిపించారు. రజినీకాంత్ తదుపరి చిత్రం 'తలైవర్ 169' కు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నాడు.