తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును సిమెంట్‌ లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నవ దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. అరకోణంకు చెందిన మనోజ్‌ కుమార్‌కు, తాంబరంకు చెందిన డాక్టర్‌ కార్తీకతో అక్టోబర్‌ 28వ తేదీన పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు మూడు రోజుల పాటు కార్తీక ఇంట్లో ఉన్నారు. ఆదివారం నాడు రాత్రి సమయంలో నవ దంపతులు కారులో అరకోణంకు బయల్దేరారు. ఈ క్రమంలోనే కారు పెరంబాక్కం వద్ద ప్రమాదానికి గురైంది. అరకోణం నుంచి చెన్నైకి వెళ్తున్న సిమెంట్‌ లారీ.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ఘోర ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. మనోజ్‌ కుమార్‌, డాక్టర్‌ కార్తీకలు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు పోలీసులు శ్రమించి.. కారు మధ్యలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తిరువళ్లూరు ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. పెళ్లి జరిగిన నాలుగు రోజులకు నవ దంపతుల మృతి చెందడంతో.. ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story