విషాదం.. రోడ్డుపై జారిపడి కరెంట్‌ షాక్‌తో యువతి మృతి

Bengaluru woman's death after slipping on flooded road sparks outrage. భారీ వర్షాలు బెంగళూరు నగరాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం

By అంజి  Published on  6 Sep 2022 9:34 AM GMT
విషాదం.. రోడ్డుపై జారిపడి కరెంట్‌ షాక్‌తో యువతి మృతి

భారీ వర్షాలు బెంగళూరు నగరాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇక నగరవాసుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. కాగా తాజాగా వరద నీటితో నిండి ఉన్న రోడ్డుపై ఓ స్కూటీపై వెళ్తున్న యువతి ప్రమాదవశాత్తు జారి పడి.. కరెంట్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ప్రభుత్వంపై ఆగ్రహాన్ని రేకెత్తించింది. యువతి మృతికి కారణంగా ప్రభుత్వ నిర్లక్ష్యమని అంటున్నారు. మృతురాలిని అఖిలగా గుర్తించారు.

అఖిల సోమవారం రాత్రి తన స్కూటీపై ఇంటికి తిరిగి వస్తుండగా నగరంలోని వైట్‌ఫీల్డ్ సమీపంలో జారిపడి విద్యుత్ స్తంభానికి ప్రమాదవశాత్తు తగిలింది. మయూర బేకరీ దగ్గర అఖిల తన స్కూటీ దిగింది. అక్కడ రోడ్డు చాలా వరకు నీటమునిగింది. మోకాళ్ల లోతు నీటిలో ద్విచక్రవాహనాన్ని నెట్టుకు వస్తుండగా.. ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది. ఈ క్రమంలోనే పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకుంది. దానికి కరెంట్‌ సరఫరా జరగడంతో.. యువతి విద్యుదాఘాతానికి గురైంది.

బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె మృతికి ప్రభుత్వ అధికారులు, బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్) నిర్లక్ష్యమే కారణమని అఖిల కుటుంబ సభ్యులు ఆరోపించారు. యువతి ప్రమాదవశాత్తు మృతి చెందారనే వార్త వ్యాపించడంతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి.

రాత్రిపూట కురిసిన భారీ వర్షాల కారణంగా బెంగళూరు తీవ్రంగా ప్రభావితమైంది. దీని వలన చెరువులు, మురికినీటి కాలువలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. రెయిన్‌బో డ్రైవ్‌ లేఅవుట్‌, సన్నీ బ్రూక్స్‌ లేఅవుట్‌, సర్జాపూర్‌ రోడ్డులోని కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ఉదయం పూట విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లేవారిని తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లు, పడవలను వినియోగించారు. నగరంలోని వైట్‌ఫీల్డ్, ఇందిరానగర్, కెంగేరి, ఆర్‌ఆర్ నగర్, బొమ్మనహళ్లి, మారతల్లి, మహదేవపుర వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Next Story