కోవిద్-19 తో చనిపోయిన తండ్రిని చూడాలంటే 51000 రూపాయలు కట్టమన్నారు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Aug 2020 5:41 PM ISTకోవిద్-19 కష్టకాలంలో కూడా ఆసుపత్రుల యాజమాన్యాలు డబ్బులు సంపాదించాలనే భావిస్తూ ఉన్నాయి. కోవిద్-19 తో చనిపోయిన ఓ వ్యక్తిని చూడాలంటే 51000 రూపాయలు కట్టాలని అడిగిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
కరోనా లక్షణాలతో హరి గుప్తా అనే వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఆ వ్యక్తి చనిపోయాడు. అతడు చనిపోయిన కొన్ని గంటలకు కానీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. చాలా సమయం తర్వాత చనిపోయిన విషయం వెల్లడించిన ఆసుపత్రి సిబ్బంది 51000 రూపాయలు కడితేనే మృతదేహాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారట.
ఈ ఘటనపై హరి గుప్తా కుమారుడు సాగర్ గుప్తా ఆసుపత్రి యాజమాన్యం చేసిన పనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'తెల్లవారుజామున 1 గంటకు మీ తండ్రి చనిపోయాడంటూ.. ఆదివారం మధ్యాహ్నం మాకు ఫోన్ చేసింది ఆసుపత్రి యాజమాన్యం. ఎందుకు ముందుగానే చెప్పలేదు అని అడుగగా కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ లేదని అందుకే చెప్పలేదంటూ సమాధానం ఇచ్చారు' అని సాగర్ గుప్తా తెలిపాడు. ఎంతో నిర్లక్ష్యంగా వారు సమాధానం చెప్పారని సాగర్ తెలిపాడు.
తమ కుటుంబం ఆసుపత్రికి చేరుకోగా.. మృతదేహాన్ని దహన సంస్కారాలకు పంపామని తెలిపారు. శిబ్పూర్ స్మశాన వాటికకు చేరుకోగా.. చివరి చూపులు చూడాలంటే 51000 రూపాయలు చెల్లించాలని కోరారట..! ఎందుకు అని ప్రశ్నించడంతో వారు వెంటనే 31000 రూపాయలు చెల్లిస్తే చాలని తెలిపారు. దీంతో హరి గుప్తా కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు కూడా సరైన సమాధానం చెప్పలేదు. మీరు వెనక్కు వెళ్లిపోండి.. ఉన్నతాధికారులతో అడుక్కోండి.. అంటూ చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించాలని ప్రయత్నించగా ఆసుపత్రి సిబ్బంది ఫోన్ ను లాగేసుకుంది. అంతేకాదు ఆఖరి సారి చూడాలని అనుకున్న కుటుంబానికి నిరాశే ఎదురైంది. కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రి సిబ్బంది మాత్రం కుటుంబ సభ్యుల కాంటాక్ట్ లేకపోవడంతోనే సంప్రదించలేదని చెబుతోంది.