కరోనాను జయించిన సింగర్ సునీత
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Aug 2020 10:52 AM ISTప్రముఖ సింగర్ సునీత కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై సింగర్ సునీత తాజాగా తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియోని విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. నా క్షేమం కోరుతూ.. ఎందరో ఫోన్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు. నిజమే. నేను కోవిడ్ బారిన పడిన మాట వాస్తవమే.
ఇటీవల ఓ షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత తలనొప్పి రావడంతో ఎందుకైనా మంచిదని.. టెస్ట్ చేయించాను. మాములు రోజులలో అయితే అది ఒక మాములు తలనొప్పిగానే ఉంటాం.. కానీ కరోనా మహమ్మారి ఎక్కువగా ఉండటం.. అజాగ్రత్తగా ఉండకుండా పరీక్ష చేయించాను. అందులో పాజిటివ్ నిర్థారణ అయింది. అప్పటి నుంచి వైద్యుల సూచనలు పాటిస్తూ.. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి కేర్ తీసుకున్నాను. ప్రస్తుతం కోలుకుని, ఆరోగ్యంగా ఉన్నాను. ఈ మహమ్మారితో పోరాటం అంత సులువైనది కాదు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. నాకు చాలా తక్కువ లక్షణాలు ఉండటం వల్ల త్వరగా కోలుకున్నానని తెలిపారు.
అలాగే సునీత లెజండరీ సింగర్ బాలసుబ్రమణ్యం గురించి వీడియోలో ప్రస్తావించారు. నేను కోలుకున్నాను.. ఇప్పుడు నా బాధ అంతా బాలుగారి ఆరోగ్యం గురించే.. ఇన్ని రోజులు బాలు గారి ఆరోగ్యం గురించి నేను, నా కుటుంబ సభ్యులు ప్రార్థించాం. ఆయన త్వరగా కోలుకుని రావాలి.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. మీరు కూడా ప్రార్థించండని సునీత ఈ వీడియోలో పేర్కొన్నారు.