నాన్న ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు.. వెంటిలేటర్‌పైనే ఉన్నారు: ఎస్పీ చరణ్‌

By సుభాష్  Published on  18 Aug 2020 1:30 PM GMT
నాన్న ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు.. వెంటిలేటర్‌పైనే ఉన్నారు: ఎస్పీ చరణ్‌

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. కరోనాతో పోరుడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వెంటలేటర్ తొలగించారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నానని అన్నారు.

విడుదల చేసిన వీడియో సందేశం ప్రకారం.. ''అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. నాన్నగారి వెంటిలేటర్‌ తొలగించినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రార్థనలు, ఆకాంక్షలు నిజమవుతాయని మేము నమ్ముతున్నాం. మీ దీవెనలు ఆయనకు కావాలి. మీ ప్రేమాభిమానులను కొనసాగించండి. ధన్యవాదాలు'' అని బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

అలాగే బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, గాయకులు ఆకాంక్షిస్తున్నారు.

Next Story