విభిన్నమైన కథతో శర్వానంద్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2020 8:13 PM ISTవిభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఇటీవల జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సమంత కథానాయికగా నటించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ హీరో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ''ఆడాళ్లూ.. మీకు జోహార్లు'' అనే సినిమాలో శర్వా నటిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ముహూర్తం మరియు వేదిక ఖరారు చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 25న తిరుపతిలో ''ఆడాళ్లూ.. మీకు జోహార్లు'' చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ చిత్రం మహిళల గొప్పతనాన్ని వివరించే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్ కు మంచి ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని రైట్ సబ్జెక్టు ఎంచుకున్నాడని చెప్పవచ్చు. 'నేను శైలజ' 'ఉన్నది ఒకటే జిందగీ' 'చిత్రలహరి' 'రెడ్' వంటి సినిమాలను రూపొందించిన కిషోర్ తిరుమల తొలిసారి శర్వానంద్ తో కలవబోతున్నారు. ప్రస్తుతం శర్వానంద్ 'శ్రీకారం' అనే సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత శర్వానంద్ మాహా సముద్రం అనే సినిమా చేస్తున్నాడు . ఆర్ఎక్స్ 100 సినిమాతో హిట్ అందుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శర్వతోపాటు సిద్దార్థ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.