రామోజీ రావుకు 'సుప్రీం' నోటీసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Aug 2020 2:47 AM GMT
రామోజీ రావుకు సుప్రీం నోటీసులు

ఆర్‌బీఐ నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా డిపాజిట్లు వ‌సూలు చేశార‌నే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థతోపాటు ఆ సంస్థ అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే, కేసులో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు, మాజీ ఐపీఎస్‌ అధికారి కృష్ణంరాజుకు కూడా నోటీసులు జారీ చేసింది.

మార్గ దర్శి సంస్థ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందన్న అభియోగాలతో ట్రయల్‌ కోర్టులో దాఖలైన క్రిమినల్‌ కంప్ల యింట్‌ను ఉమ్మడి హైకోర్టు తన చివరి పని దినం రోజున కొట్టేస్తూ ఇచ్చిన తీర్పును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సవాలు చేశారు. దీనిపై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ పిల్‌లో ఆర్బీఐను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను అంగీకరించి.. ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చి నోటీసులిచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌. సత్యనారాయణ ప్రసాద్‌ వాదించారు. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి సంస్థ దాదాపు రూ.2,600 కోట్ల మేరకు డిపాజిట్లు సేకరించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ట్రయల్‌ కోర్టులో ఉన్న క్రిమినల్‌ కంప్లైంట్‌ను కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి సంస్థ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిందని.. దానిని 2018 డిసెంబరు 31న హైకోర్టు కొట్టివేసిందని కోర్టుకు వెల్ల‌డించారు.

అలాగే.. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ ఆర్బీఐ చట్టం–1934లోని సెక్షన్‌ 45(ఎస్‌) నిబంధనను ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేయగా.. ఉమ్మడి హైకోర్టు ఈ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)ను తప్పుగా అన్వయించి క్రిమినల్‌ కంప్లయింట్‌ను కొట్టేసిందని నివేదించారు. హిందూ అవిభక్త కుటుంబం(హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ‌) యాక్ట్ ప్ర‌కారం సంస్థలకు డిపాజిట్లు సేకరించే అధికారం లేదని వివరించారు. ఈ అంశానికి సంబంధించి 2006లో నాటి ఏపీ ప్రభుత్వం ఆర్బీఐకి లేఖ రాయగా.. మార్గదర్శి సంస్థ సెక్షన్‌ 45(ఎస్‌) ప్రకారం లావాదేవీలకు వీలు లేదని 2007లో ఆర్బీఐ స్పష్టం చేసిందన్నారు.

Next Story
Share it